Nov 18,2022 10:32
  • ఒక్క విద్యుత్‌ కనెక్షనూ ఇవ్వని వైనం
  • సరైన రోడ్లు లేక అల్లాడుతున్న జగనన్న కాలనీలు

ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి : ఈ చిత్రం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తిమ్మోజిపల్లి లోనిది. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న జగన్న కాలనీలో 70 ఇళ్లు ఇచ్చారు. ఇందులో దాదాపు 20 పూర్తయ్యాయి. నీటి కోసం బోరు అయితే వేశారు గాను కరెంటు కనెక్షన్‌ మాత్రం ఇవ్వలేదు.
 

                  సరైన రోడ్డు సదుపాయం లేకపోవడం వల్ల నత్తనడకన ఇంటి నిర్మాణ పనులు సాగుతున్నాయి.

ఇది ఒక్క తిమ్మోజి పల్లిలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. తాము కాలనీలను కాదు.. ఊళ్లను నిర్మిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వానికి వాటిల్లో మౌలిక సదుపాయలు ఏర్పాటు చేయలనే ఆలోచన లేకపోవడం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వైసిపి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15.58 లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. వీటిల్లో 13.66 లక్షల ఇళ్లకు రిజిస్టర్‌ చేసింది. ఇందులో1.33 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. బేస్‌మెంట్‌ లెవల్‌ కన్నా ఎక్కు ఉన్న గృహాలు వివిధ దశల్లో 5.62 లక్షలున్నాయి. డిసెంబర్‌ 21వ తేదీ నాటికి నాలుగు లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించాలని అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. కానీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం మీనమేషాలు లెక్కేస్తోంది.
 

                                                                    విద్యుత్‌ లేక అవస్థ

ప్రతి లే అవుట్‌లో బోరు వేశారు. కానీ విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడం మరిచారు. లే అవుట్‌ వేసినప్పుడు ఏర్పాటు చేసిన మట్టిరోడ్లే ఇంకా ఉన్నాయి. వర్షాలకు ఈ రహదారులు బురదమయంగా మారుతున్నాయి. నిర్మాణ సామగ్రి తెచ్చుకునేందుకు లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడు తున్నారు. కిరాయికి ఆటోవాళ్లు రావ్వాలని భయపడి పోతున్నారు. ఒక వేళ వచ్చినా అదనంగా డబ్బులు చెల్లించాలని డిమాండు చేస్తున్నారు. విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వక పోవడం వల్ల అన్ని పనులకూ ఇబ్బందులు ఎదురవు తున్నాయని లబ్ధిదారుడు హేమచంద్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.