Jul 05,2023 12:15

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం మద్దిలపాలెం జోన్‌ ఆధ్వర్యంలోని బుధవారం స్థానిక పిఠాపురం కాలనీ సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం కార్యదర్శి వి.కృష్ణరావు మాట్లాడుతూ .... కరెంటు మీటర్లు పీకేసి స్మార్ట్‌ మీటర్లు బిగించి ప్రజలపై పెద్దఎత్తున భారాలు వేయడానికి కేంద్ర బిజెపి, రాష్ట్ర వైసిపి ప్రభుత్వాలు సిద్ధపడుతున్నాయని, ప్రభుత్వ బెదిరింపులు, వేధింపులు పెంచిన కరెంటు ఛార్జీలు, స్మార్ట్‌ మీటర్లు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ... సిపిఎం విశాఖ ప్రజలకు పిలుపునిస్తున్నదన్నారు. ప్రజలు ఆస్తిపన్ను చెల్లిస్తున్నారనీ, ఇందుకు జివిఎంసి ప్రజలకు కనీస అవసరాలు తీర్చాలని కోరారు. దీనిలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచి ప్రజల ఆరోగ్యాలను కాపాడటం ఒక బాధ్యత అని అన్నారు. ఒకవైపు భూమి, భవన విలువ ఆధారంగా ఆస్తి పన్ను భారీగా విధించారనీ, మళ్లీ అదనంగా చెత్తపన్ను విధించారని మండిపడ్డారు. దీనిని ప్రజలు ఐక్యంగా తిరస్కరించారన్నారు. చెత్తపన్నులు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని సిపిఎం కోర్టులో కేసు వేసిందని, ఇది పెండింగ్‌లో ఉందని తెలిపారు. ప్రభుత్వం, అధికారుల బెదిరింపులకు వెరవకుండా ప్రజలు తమ ప్రతిఘటనను కొనసాగించాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తున్నదన్నారు. ఈ నిరసనలో సిఐటియు మద్దిలపాలెం జోన్‌ కార్యదర్శి పి.వెంకటరావు, సీపీఎం మహిళ కార్యదర్శి కుమారి, ప్రజానాట్యమండలి కార్యదర్శి చంటి, సీనియర్‌ నాయకులు బివిఎన్‌ చలపతి, అనపర్తి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.