Nov 28,2022 07:30

సిక్కోలు జాలర్లు నీళ్లల్లో ఈదగలిగారు గానీ, కన్నీళ్లలో ఈదలేకపోయారు.. చేపలు పట్టి, గుజరాత్‌ సేట్ల ఎదాన కొట్టినా వాళ్ల బతుకు బాగుపడటం లేదు.. మహాసాగరంలో మునగానాం తేలానాంగా నిత్యం వ్యధాభరితమై సాగిపోతోంది వారి జీవితం.. ఈ వేదన నుంచీ, ఈ ద్ణుఖం నుంచీ ఉబికి వచ్చిందే చింతకింది శ్రీనివాసరావు నవల 'మున్నీటిగీతలు'.
             ప్రతి మనిషికీ ఉన్న రెండు కళ్లూ రెండు సముద్రాలే కదా! వాటినుంచి బయల్పడేవీ ఉప్పని వెచ్చని జలాలే కదా! భూమ్మీద గీతలు గీసి, దేశాలుగా కోసి, రాష్ట్రాలుగా చేసి, జిల్లాలుగా దూసి విభజించడానికేనా మేధస్సు ఉన్నది? ఇప్పటికే మానవుడు ఆడ, మగ అని గీశాడు. ధనిక, పేద అని గీశాడు. కులాలు, మతాలు అని గీశాడు. అసలు మనిషి ఉన్నది గీతలు గియ్యడానికా? గీతలు చెరపడానికా? అందరి ఆకలీ ఒక్కటే అయినప్పుడు, అందరి నవ్వూ ఒకటే అయినప్పుడు, అందర్నీ కన్నప్పుడు తల్లుల నొప్పుల తీరు సమానమే అవుతున్నప్పుడు ఈ గీతలేంటి? ఈ గిరిగీసుకోవడం ఏంటి? విశ్వమానవునిగా ఎదిగిన 'మున్నీటి గీతలు' నవల మన ముందుకు తెచ్చే అంశాలివే. ఆలోచింపజేసే విషయాలివే. ధనబంధం లేని మానవతా సంబంధాలు ఏర్పడాలని, దేశానికి మించిన దేహసముదాయాలు నెలకొనాలని నొక్కి చెప్పే కథాకథనమిదే.
         చేపల వేట కోసం సముద్ర జలాలు దాటేసి, సరిహద్దులు తెలియని స్థితిలో పరాయి దేశాల నావికా దళానికి చిక్కిపోయి, ఏళ్ల తరబడి విదేశీ కారాగారాల్లో మగ్గిపోతున్న పేద మత్స్యకారుల గతుకుల బతుకుల్ని కళ్లకు కడుతుంది ఈ నవల. గంగపుత్రుల భద్రత లేని జీవితాలను యధాతథంగా తెలియజేస్తుంది. తెలుగు సాహిత్యంలో ఇంతవరకూ ఎన్నడూ చూడ(లే)ని బెస్తల ఇతివృత్తంతో బాధ్యతలా సాగిపోతుంది. పటిష్టమైన నిర్మాణం, అద్భుతమైన పలుకుబడి, అసమాన శైలీవిలాసం ఈ రచనకు ఆస్తిపాస్తులు. చింతకింది శ్రీనివాసరావు దీనిని చేపట్టిన, నిర్వహించిన తీరు తిరుగులేనిది.
       మత్స్యకారుల మనుగడలోని ఆనందాలు, విషాదాలు, ఆకలి, పోరాటం, ఇక్కట్లు, ఇబ్బందులు తదితరాలన్నింటినీ మున్నీటి గీతలు పట్టి చూపుతుంది. శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతంలోనూ, ఆ మాటకొస్తే కళింగాంధ్రలోనూ మత్స్యకారుల జనాభాకు సరిపడినన్ని ఫిషింగ్‌ హార్బర్లు లేవు. చేపల వేటకు అవసరమైన జెట్టీలు లేవు. పొడవైన తీరప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నదని గర్వపడాలో, తీరంలో జాలర్లకు కనీస సదుపాయాలే లేవని బాధపడాలో అర్థం కాదు. భావనపాడు పోర్టు నిర్మాణం ఇప్పటికీ కాగితాల మీదనే కనిపిస్తోంది. ఇలాంటి స్థితిలో ఆకలికి తాళలేని సిక్కోలు మత్స్యకారులు వలస పోవలసి వస్తోంది. గుజరాత్‌ తీరానికి వెళ్లి, ఆక్కడి బడా సేట్ల కంపెనీల కోసం చేపల్ని పట్టవలసి వస్తోంది. సేట్లు ఇచ్చే జీపీఎస్‌లు పనిచేయక, పడవలు సరిగ్గా నడవక, వారు సముద్రంలో తరచూ గల్లంతవుతున్నారు. పాకిస్థాన్‌ బోర్డర్‌ను తెలియజేసే నీటి మీద గీతల్ని గుర్తుపట్టలేక ఆ దేశపు జవాన్లకు అందిపోతున్నారు. ఆ తర్వాత వాళ్ల ఆయుష్షు దైవాధీనం. ఈ సంగతులన్నింటినీ అచ్చమైన కళింగాంధ్ర యాసభాషల్లో తీర్చిదిద్దారు రచయిత చింతకింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రైల్వేస్టేషన్‌ నుంచి మత్స్యవేనం గ్రామ జాలర్ల జట్టు గుజరాత్‌లోని వెరావల్‌ ఫిషింగ్‌ జెట్టీకి వెళ్లడం మొదలాడి, పడమర సముద్రంలో గీతలు దాటిపోయి, కరాచీ జైలుకు చేరిపోయి, విడుదలై స్వగ్రామానికి తిరిగివచ్చేవరకూ వివరిస్తుంది ఈ నవల. రచయిత అక్షరశక్తి అడుగడుగునా ముద్ర వేసుకుంటూ ఆసక్తిగా చదివించుకుంటూ వెళుతుంది. సామెతలు, నానుళ్లు, దేశీయ పదబంధాలు, మాండలిక సౌరభాలతో మెరిసిపోతుంది. పోటెత్తిన సముద్రం, నీరుతీసిన సాగరం, కుదుపుల వేట, విసిరిన వలలు, ఎడగాలి, సుడిగాలి, వాన, వరద, చేపలరకాలు, పడవ ఎదుర్కొనే ఒడిదుడుకులు, తాండేలు (బోటు డ్రయివర్‌) విన్యాసాలు, కళాసీల (మత్స్యకార్మికులు) శ్రమదమాదులు ఆవిష్కరిస్తుంది.
           పారిశ్రామిక వ్యర్థజలాలను సముద్రంలోకి పంపేసి.. తగరం, జింక్‌ కడుగుడు నీళ్ళను, వివిధ లోహశుద్ధీకరణ వ్యర్థాలనూ సాగరంలోకి తరలించి.. మత్స్యజాతిని పెట్టుబడిదారులు ఎలా అంతమొందిస్తున్నారో, ఫలితంగా నిరుపేద గంగపుత్రులు ఎలా సర్వనాశనం అయిపోతున్నారో 'మున్నీటిగీతలు' తెలియజేస్తుంది.
           కథలో నాయికానాయకులైన పోలారావు, ఎర్రమ్మల నడుమ అంకురించిన ప్రేమ, ఉదాత్తమైన వారి నడత, సముద్రాన్నే సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. నీళ్లే నీళ్లాడినట్టు చేస్తుంది. జలారణ్యంలో నిర్భీతిగా, సరికొత్త అనుభవంతో పాఠకులు పరిభ్రమించేలా చేస్తుంది.
పది కాలాల పాటు సాహిత్యంలో నిలిచిపోయే రచన చేయాలంటే ఎంతటి పట్టుదల, మరెంతటి పరిశోధన, ఇంకెంతటి పరిశీలన అవసరమో భావితరం రచయితలకు స్పష్టం చేయగలదీ నవల. రచయితకు పదసంపదతో పాటు తాదాత్మ్యం చెందే హృదయం, అద్వైతదృష్టి, క్షేత్ర దర్శనశక్తి పుష్కలంగా ఉంటేగానీ ఇలాంటి రచనలు చేయలేరు. ఆ లక్షణాలన్నీ సమృద్ధిగా ఉండబట్టే ఇంతటి మహత్తర నవల చింతకింది శ్రీనివాసరావు రాయగలిగారు. బెస్తల్లో బెస్తగా ఒకానొక పరకాయ ప్రవేశమేదో రచయిత విజయవంతంగా చేసినట్టు చెప్పుకోవచ్చు. మత్స్యకార గ్రామాల్లో తిరిగి, వాళ్లతో మమేకమై, వాళ్ల జీవన విధానాన్ని ఆకళింపు చేసుకోవడం వల్లనే ఈ రచనను ఆయన ఇంత ఘనంగా నడిపించగలిగారనేది నిస్సందేహం.
'మున్నీటిగీతలు' తెలుగు మత్స్యకారుల కఠినమైన జీవన దృశ్యాలను పదుగురికీ విస్పష్టం చేయగల గొప్ప నవల. ఇది జాలర్ల బతుకుల మీద ప్రసరించిన సూర్యకిరణ జాలం. మానవతా పరిమళాలను వెదజల్లే నవ్యవేదం. ఒకరకంగా ఇదొక ఆధునిక మత్స్యపురాణం. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 సంవత్సరపు ప్రతిష్టాత్మక నవలా పోటీల్లో బహుమతి పొందిన ఈ 'మున్నీటిగీతలు' అందరూ చదవాల్సింది. సంబరపడవలసింది. ఉత్సుకత, ఉద్వేగాల నడుమ తేలిపోవలసింది. రచయిత చింతకింది శ్రీనివాసరావుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేయవలసింది.

- ఆకుల మల్లేశ్వరరావు
79818 72655