దేవదాయశాఖ అధికారుల చేతులు కట్టేసిన అధికార పార్టీ పెద్దలు : సిపిఎం నేత డి.వెంకన్న
దేవరాపల్లి (అనకాపల్లి) : దేవరాపల్లి మండలం, మారేపల్లి రెవెన్యూ సర్వే నెంబరు 115 లో కోట్లాది రూపాయలు విలువ చేసే 23 ఎకారాల 15 సెంట్లు దురాక్రమణకు గురైన దేవునిమాన్యానికి అన్ని ఆధారాలున్నప్పటికీ స్వాధీనం చేసుకోలేని నిస్సహాయత స్థితిలో దేవదాశాఖ అధికారులు ఉన్నారని దేవదాయశాఖ అధికారుల చేతులను అధికార పార్టీ పెద్దలు పూర్తిగా కట్టేశారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి.వెంకన్న ఆరోపించారు. బుధవారం డి.వెంకన్న ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ భూమి పూర్వం సెటిల్ మెంట్ కు ముందు 10, (1) లో ఈభూమి మారేపల్లి గ్రామానికి చెందిన ఆవుగడ్డ సఖూరినాయుడు ధర్మ కర్తగా ఉన్నారని, 1956 లో భూమి సెటిల్ మెంట్ అయిన తరువాత మారేపల్లి శ్రీరాములు వారి పేరున నమోదయ్యిందన్నారు. ఇది తారువా గ్రామానికి చెందిన వ్యక్తులకు ఏ విధంగా దాఖలు పడిందని ప్రశ్నించారు. ఈ భూమి ఆక్రమణకు గురైందని దీనిపై ఆక్రమణదారునికి ఎలాంటి అధికారాలు ఉన్నా ఆంధ్రప్రదేశ్ ఎండోమెంటు ట్రిబ్యునల్‌కు వెళ్ళాలని, భూములు అమ్మిన వ్యక్తులు కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఎలాంటి పాస్ బుక్కులను ఇవ్వకూడదని స్పష్టం చేస్తూ గతంలో ఉన్న అనకాపల్లి దేవదాశాఖ అసిస్టెంటు కమిషనర్ తేదీ.14/6/2022న దేవరాపల్లి తహశీల్దార్‌వారికి రాశారన్నారు. దీని ఆధారంగా తహశీల్దార్ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇప్పటికి మూడుసార్లు పాస్ బుక్కలను తిరస్కరించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంటు చట్టం లోని సెక్షన్ 81 ప్రకారం ఏదైనా మతపరమైన స్థిర ఆస్తి అమ్మకం, లేదా ఆక్రమణ చెల్లదన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పుల్ బెంచ్ రిఫరెన్స్ లో ఉదహరించిన తీర్పు లో దార్మిక మతపరమైన ఎండోమెంటు, స్థిరమైన ఆస్తులు, సెక్షన్ 43 ప్రకారం, అక్రమణదారునికి హక్కులు ఉంటే ఎండోమెంటు యాజమాన్యంను సవాల్ చేస్తు కోర్టుకు వెళ్ళాలని అలా చేయకపోతే ఆక్రమణదారునికి ఎలాంటి హక్కులు ఉండవన్నారు. ఎండోమెంటు పాత సెక్షన్ 38/25 రిజిస్టర్లు ప్రకారం కూడా ఓసారి రెవెన్యూ సెటిల్ మెంట్ పెయిర్ అడంగల్ లో మతపరమైన ఆస్తిగా రికార్డుల్లో నమోదయితే అది ఎండోమెంటు భూమి కిందనే ఉంటుందని దేవదాయశాఖ చట్టం స్పష్టం చేయబడిందన్నారు. దీని ప్రకారం భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ తేదీ.12/9/2022 న ఫిర్యాదు చేయడంతో పాటు ఉమ్మడి జిల్లా అసిస్టెంటు కమీషనర్ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా అసిస్టెంటు కమీషనర్ కు చాలాసార్లు ఫిర్యాదులు చేశారని తెలిపారు. దీంతో దేవదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్ అనకాపల్లివారు వారి సిబ్బందితో భూముల పరిశీలన చేసి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారన్నారు. ఆక్రమణదారునికి నోటీసులిస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. అధికారం ఉంటే దేవుని భూములు కూడా అమ్మేసుకోవచ్చునన్న అధికార పార్టీ పెద్దలకు త్వరలో ప్రజలే గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. వెంటనే దేవదాయశాఖ అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళుకు తలగ్గకుండా భూమిని స్వాధీనం చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కాపాడాలని వెంకన్న డిమాండ్ చేశారు.










