హేమంతపురి రాజ్యానికి విక్రమసింహుడు రాజు. తనకు కాబోయే భార్య కోసం విలువైన వజ్రాలతో కూడిన హారాన్ని తయారుచేయించాడు. దాన్ని ఓ రోజు ప్రదర్శనశాల్లో ఉంచాడు. సాయంత్రానికి హారం కనబడలేదు. సైనికుల చేత రాజ్యం అంతా వెతికించాడు. కానీ, హారం కనబడదు. దీంతో హారాన్ని వెతికి తెచ్చిన వారికి వెయ్యి వరహాలు బహుమతిగా ఇస్తానని రాజ్యమంతా ప్రకటన చేయించాడు.
కిరణ్ అనే యువకుడు మంచినీళ్ల కోసం చెరువు వద్దకు వెళ్లాడు. అందులో ఏదో హారం కనబడుతుంది. రాజు ప్రకటించిన గుర్తులతో హారం ఉండటంతో చెరువులో దిగి దానిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ చేతికి దొరకలేదు. చెరువు అంతా బురద బురదగా మారిపోయింది. హారం కనిపించలేదు.
కిరణ్ ఏమీ అర్థంకాక చెరువు గట్టుమీద కూర్చున్నాడు. కొంత సమయం తర్వాత బురదగా ఉన్న నీరు తేటగా మారింది. హారం కనిపించింది. మళ్లీ సరస్సులోకి దిగి హారాన్ని పట్టుకోడానికి ప్రయత్నించాడు. ఫలితం లేకపోయింది.
దాంతో కిరణ్ దిగులుగా ఒడ్డున కూర్చున్నాడు. ఇంతలో అటువైపుగా ఒక సాధువు వెళ్తూ ... కిరణ్‌ని చూశాడు. అలా ఎందుకు ఉన్నాడో అడిగి తెలుసుకున్నాడు. మహర్షి కొంత సేపు ఆలోచించి... 'నాయనా, హారం సరస్సులో లేదు. ఒడ్డున ఉన్న చెట్టు కొమ్మపైన ఉంది. దాని ప్రతిబింబం నీకు నీళ్లలో కనిపిస్తుంది.' అన్నాడు. ఆ మాటలకు కిరణ్ ఒక్కసారిగా తల పైకి ఎత్తి చూశాడు. అక్కడ కొమ్మల మధ్య హారం కనిపించింది. కిరణ్ ఆనందంతో చెట్టు ఎక్కి హారం తీసుకున్నాడు. కిందకు దిగాక సాధువుకి కృతజ్ఞతలు తెలిపాడు. అప్పుడు మహర్షి 'ఎంతసేపూ ఆత్రుతగా నీళ్లలో హారం కోసం వెతకాడనికి కష్టపడ్డావు గానీ కొంచెం మెదడుకు పని చెప్పలేదు. కొద్దిగా ఆలోచించి ఉంటే హారం ఎక్కడ ఉందో కనిపించేది. సరే ఈ హారం తీసుకెళ్లి రాజుగారికి ఇచ్చి బహుమతి అందుకో. మంచిగా జీవించు' అని దీవించి వెళ్లిపోయాడు సాధువు.
పిల్లలూ, మీ కథలు, బొమ్మలూ పంపండి. ఇదిగో మెయిల్ ఐడీ: chinnaarips@gmail.com
- బి. ఉదయిని,
7వ తరగతి,
నారాయణ స్కూలు,
ఒంగోలు,
ప్రకాశం జిల్లా.










