ఢిల్లీ: భారత్‌లో విజయవంతమైన రిలయన్స్ జియోను ప్రపంచవ్యాప్తంగానూ తీసుకెళ్లే ఆలోచన ఉందని కంపెనీ అధ్యక్షుడు మాథ్యూ ఊమెన్ వెల్లడించారు. భారత్ ఇప్పుడు టైర్-1 ప్లస్ దేశమని.. ప్రపంచ విపణిలోకి ప్రవేశించేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయన్నారు. భారత్‌ను ప్రపంచ వేదికపై రిప్రజెంట్ చేసేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించడం రిలయన్స్ నిరంతరం కొనసాగిస్తుందని తెలిపారు. తద్వారా భారత్‌లో అమలు చేసి నిర్వహిస్తున్న సాంకేతిక సామర్థ్యాలను ప్రపంచవ్యాప్తంగానూ కస్టమర్లకు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.డిజిటల్ ఇండియా విజన్‌ను మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలంటే 'యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ ను కేవలం టవర్ల ఏర్పాటుకు మాత్రమే ఉపయోగించొద్దని ఊమెన్ సూచించారు. డివైజ్‌లు, సేవలను మరింత అందుబాటు ధరలో యూజర్లకు చేరువ చేసేందుకు కూడా ఆ నిధులను వాడాలని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం టెలికాం కంపెనీల ఆదాయం నుంచి ఎనిమిది శాతం లైసెన్స్ ఫీజు కింద వసూలు చేస్తోంది. దీంట్లో ఐదు శాతం నిధులను యూఎస్‌ఓఎఫ్ కింద పక్కకు తీస్తోంది. దీన్ని మారుమూల ప్రాంతాల్లో టెలికాం కనెక్టివిటీని పెంచడం కోసం ఉపయోగిస్తోంది.యూఎస్‌ఓఎఫ్ కోసం వసూలు చేస్తున్న ఐదు శాతం ఫీజును పూర్తిగా తొలగించాలని ఊమెన్ కోరారు. లైసెన్స్ ఫీజు కింద మూడు శాతం నిధులను మాత్రమే వసూలు చేయాలని సూచించారు. తద్వారా టెలికాం సంస్థలకు మిగిలే నిధులను అవి నిరంతర పెట్టుబడుల కింద ఉపయోగించుకుంటాయని తెలిపారు. ఫలితంగా కేవలం కనెక్టివిటీని పెంచడమే కాకుండా యూజర్లను 4జీ నుంచి 5జీకి మార్చేందుకు తోడ్పాటునందించొచ్చన్నారు. ఏ సేవలనైనా విస్తరించేందుకు డివైజ్‌లు చాలా కీలకమని వివరించారు. తాము అత్యంత అందుబాటు ధరలో 4జీ డివైజ్‌ను తీసుకొచ్చామని.. తద్వారా 4జీ వేగంగా విస్తరించిందన్నారు. అలాగే 5జీ డివైజ్‌లను రూ.10 వేల ధరలో తీసుకొస్తున్నామని.. 5జీ నెట్‌వర్క్ కూడా వేగంగా విస్తరిస్తోందన్నారు. 24 కోట్ల 2జీ యూజర్లను కొత్తతరం నెట్‌వర్క్‌లలోకి తీసుకురావడం చాలా కీలకమని పేర్కొన్నారు.