May 13,2023 10:55

ఎండలు పెరగడంతో రాత్రివేళ కూడా ఇల్లు వేడిగా ఉంటుంది. ఇల్లు చల్లగా ఉండాలంటే గృహ నిర్మాణ నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అలా చేస్తే ఎసితో పని లేకుండా ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. సాధారణంగా పైకప్పు, గోడలు గుండా ఇంట్లో వేడి లోపలకి వస్తుంది. ఈ వేడి బయటకు వెళ్లే విధంగా, లోపల ఉన్న వేడి చల్ల బడేలా చూడాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి. ఇంట్లో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి మొక్కల పెంపకం అద్భుతమైన మార్గం. ఇంటి పైన వీలైనన్ని మొక్కలను పెంచాలి. సూర్య కిరణాలను మట్టి, మొక్కలు గ్రహించి స్లాబ్‌ని చల్లగా ఉంచుతాయి. ఇంటి మీదే కాకుండా ఇంట్లో కూడా ఇండోర్‌ మొక్కలు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది. కలబంద, పామ్‌, మనీ ట్రీ, స్పైడర్‌ ప్లాంట్‌ వంటి మొక్కలు గాలి నుంచి హానికరమైన పదార్థాలను తీసేసి, ఇంట్లో వేడిని తగ్గిస్తాయి.

  •  వేడి పుట్టించే, రేడియోషన్‌ కలిగించే వస్తువులు ఇంట్లో లేకుండా చూసుకోవాలి. పైకప్పు, ఇంటి గోడల నుంచి లోపలకి వచ్చిన వేడి బయటకు వెళ్లే విధంగా ప్రతి గదికీ కిటికీలు ఉండాలి. వాటిని సాయంత్రం 5 గంటల నుంచి తెరచి ఉంచాలి.
  • ఇంట్లో వస్తువులు చిందర వందరగా ఉండకూడదు. భారీ ఫర్నిచర్‌ లేకుండా చూసుకోవాలి. వీటి వల్ల హాట్‌ ఎయిర్‌ పాకెట్స్‌ ఏర్పడి ఇంట్లోకి వచ్చిన వేడి బయటకు వెళ్ల కుండా చేస్తాయి.
  • వేసవిలో మాత్రం పలుచటి కర్టెన్లను ఉపయోగించాలి. ఇవి తేలికగా ఉండటంతో పాటు.. లోపలికి గాలి ప్రసరించేలా చేస్తాయి. తెలుపు, క్రీమ్‌, స్కై బ్లూ వంటి తేలికపాటి షేడ్స్‌ ఉన్న కర్టెన్లు వాడటం మంచిది. ఇవి వేడి గాలిని బయటకు పంపి, ఇంటిని చల్లబరచడంలో సహాయపడతాయి.
  • కిటికీలు బయటగానీ, లోపల గానీ చిన్న చిన్న పూల కుండీలను ఉంచాలి. దాంతో లోపలకి వచ్చే వేడి గాలిని గ్రహించి, పొడి గాలిని తేమగా చేయడంలో సహాయపడతాయి.
  • వేసవిలో టీవీ, కంప్యూటర్‌, ఫ్రిజ్‌, వాషింగ్‌మెషిన్‌, వ్యాక్యూమ్‌ క్లీనర్‌, హీటర్ల వినియోగాన్ని వీలున్న మేరకు పరిమితం చేసుకోవాలి. లేకుంటే వాటిని వాడుతున్నంతసేపూ వేడి వెలువడుతూనే ఉంటుంది. దీంతో ఇంట్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది.
  • టెర్రస్‌పై తెల్లటి సున్నాన్ని రెండు పొరలుగా పూతపూయాలి.
  • ఎండు వరి గడ్డిని, జమ్ము గడ్డి కట్టలను ఇంటి పైకప్పుపై పేర్చి రోజుకోసారి నీళ్లు చల్లితే వేడి లోపలకి రాకుండా ఉంటుంది.
  • పెద్ద పెద్ద కిటీకీలు ఉన్న చోట వెదురు తడికలు వేసుకోవాలి. ఇవి వేడిని గ్రహించడమే కాకుండా, ఇంటిని అందంగా కూడా ఉంచుతాయి.
  • తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా కిటికీలను, తలుపులను తెరిచి ఉంచాలి.
  • ఇంట్లో ఎక్కువ వేడి ఉత్పత్తి అయ్యేది వంట గదిలోనే. వంట గదిలోని వేడి బయటికి వెళ్లిపోయేలా వెంటిలేటర్‌ ఏర్పాటు చేసుకోవాలి. ఈ వెంటిలేటర్ల కు ఎగ్జాస్టింగ్‌ ఫ్యాన్లు అమర్చుకోవాలి.
  • ఒక ట్రేలో ఐస్‌ ముక్కలు వేసి, ఫ్యాన్‌ కింద పెడితే గదిలో చల్లదనం పరచుకుంటుంది. లేదా టబ్బులో చల్లని నీరుపోసి, గది మూలల్లో పెట్టినా గది చల్లబడుతుంది.
  • ఇంటి గోడల పక్కన పెద్ద పెద్ద రాళ్లు, సిమెంట్‌ నిర్మాణాల వంటివి అనవసరంగా ఉంటే వాటిని తొలగించాలి. అవి ఎండను గ్రహించి వేడిని పెంచుతాయి.
  • బెడ్స్‌, సోఫాల మీద మెత్తటి కాటన్‌ క్లోత్స్‌ను వేయాలి. వేసవి కాలంలో. పాత స్టైల్‌, కాటన్‌ పరుపులు వాడటం మంచిది.
  • ఇంటి బయట గోడలకు మట్టిని ఒక లేయర్‌గా పూత పూస్తే కఠినమైన వేడిసైతం లోపలకి వెళ్లకుండా ఉండి గది చల్లగా ఉంటుంది.
  • ఇంట్లో ఆహ్లాదాన్ని పెంచేలా ఉన్న పెయింటింగ్‌ను గోడకు అమర్చడం మంచిది. వాల్‌స్టిక్కర్లను అతికించుకోవచ్చు. ఇవి కూడా అధిక ఉష్ణోగ్రత వల్ల కలిగే చిరాకును తగ్గించడంలో తోడ్పడతాయి.