
ఇంటర్నెట్‌డెస్క్ : ఏదైనా పనిచేసుకుంటూ.. మధ్యమధ్యలో టీ, కాఫీలు తాగితే పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే అదనపు పని చేయడానికి కూడా ఇష్టపడతారు. అయితే పనిలో మునిగిపోతూ.. టీ, కాఫీలను తాగడం మరచిపోతే.. ఆ తర్వాత వాటిని తాగలేము. మరి ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికే 'ఇకాగో హీట్ కోస్టర్' మార్కెట్లోకి వచ్చేసింది. ఈ హీట్ కోస్టర్ ఓ చిన్న ట్రే సైజులో ఉంది. దానిపైన కప్పులో టీ, కాఫీలు పోసి, ప్లగ్ పెట్టుకుని స్విచాన్ చేసుకుంటే చాలు... కప్పులోని టీ లేదా కాఫీ రెండు గంటల వరకు చల్లారిపోకుండా ఉంటాయి. ఈ హీట్ కోస్టర్‌లో మనం తాగాలనుకునే పానీయం వేడిని అడ్జెస్ట్ చేసుకునే వీలుంది. గరిష్టంగా 175 డిగ్రీల ఫారెన్‌హీట్ (79.4 సెల్సియస్) వరకు హీట్‌ని అడ్జెస్ట్ చేసుకోవచ్చు. అయితే రెండు గంటల తర్వాత ఇది ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఆ తర్వాత వేడి చేసుకోవాలనుకుంటే.. మళ్లీ స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఎక్కడంటే అక్కడపెట్టుకునేందుకు వీలుగా ఉంది. అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ 'ఇకాగో'కు చెందిన డిజైనర్లు దీన్ని కనిపెట్టారు.