- జిల్లా అధికారులంతా నెలలో తొలి సోమవారం చేనేత దినం పాటిద్దాం
- కలెక్టర్ శివ శంకర్ లోతేటి పిలుపు
ప్రజాశక్తి - పల్నాడు : భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో చేనేత రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని పల్నాడు కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. 9 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో పల్నాడు జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత వస్త్రధారణ ధరించి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీలు చేనేత కార్మికులతో కలిసి నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు. చేనేత వస్త్రధారణలో జిల్లా కలెక్టర్ చేనేతలను ప్రోత్సహించేందుకు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ స్పందన హాలులో చేనేత రంగానికి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలనుకలెక్టర్ వివరించారు. స్వాతంత్య్రానికి పూర్వం స్వదేశీ వస్త్రాలను, చేనేతలను ప్రోత్సహించేందుకు స్వాతంత్ర సమర యోధులు తీసుకున్న నిర్ణయం స్ఫూర్తి దాయకమన్నారు. జిల్లా వ్యాప్తంగా చేనేత రంగంలో కొనసాగుతున్న చేనేతలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలు కలెక్టర్ సమావేశంలో వివరించారు. జిల్లాలో 3 ప్రత్యేక చేనేత క్లస్టర్‌లను ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు ఆర్థిక సహకారం, పెన్షన్లు, వ్యాపార అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. పల్నాడు జిల్లాలో ఇకనుంచి ప్రతినెల మొదటి సోమవారం జిల్లా అధికారులంతా చేనేత వస్త్రాలను ధరించి విధులకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం చేనేతరంగా అభివృద్ధికి కృషి చేస్తున్న పెద్దలను కలెక్టర్ శివశంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ట్రైనీ కలెక్టర్ కల్ప శ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకంలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వనజ, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.










