Oct 08,2023 22:22

ఆకట్టుకున్న హాంగ్జౌ ఆసియా క్రీడల ముగింపు వేడుకలు
భారత బృందం పతాకధారిగా హాకీ స్టార్‌ శ్రీజేష్‌
హాంగ్జౌ : 19వ ఆసియా క్రీడలు ముగిశాయి. హాంగ్జౌ ఒలింపిక్‌ సెంటర్‌లో క్రీడా జ్యోతి ఆరినా.. భవిత కోసం అందరం కలిసికట్టుగా నడుద్దాం అనే స్ఫూర్తి మాత్రం ఆసియా మనసు నిండా నిలిచింది. ఆదివారం హాంగ్జౌ ప్రధాన స్టేడియంలో ముగింపు వేడుకలు ఆకట్టుకున్నాయి. మరోసారి డిజిటల్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలీజెన్స్‌ పరిజ్ఞానం చాటిన చైనా.. ముగింపు వేడుకలను సైతం గుర్తుండిపోయే రీతిలో నిర్వహించింది. ఆసియా క్రీడల పతాకాన్ని హాంగ్జౌ క్రీడల ఆతిథ్య దేశం చైనా నుంచి 2026 ఆసియా క్రీడల ఆతిథ్య దేశం జపాన్‌ అందుకుంది. ఈ సందర్భంగా ఫ్లాగ్‌ అందుకునే వేడుకలో జపాన్‌ నృత్యకారులు కండ్లుచెదిరే ప్రదర్శన చేశారు. 19వ ఆసియా క్రీడలు ముగిసినట్టు ఆసియా ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు రణధీర్‌ సింగ్‌ అధికారికంగా ప్రకటించారు. 'ఆసియా క్రీడలకు చైనా సరైన ఆతిథ్య వేదిక. ఆసియా ఒలింపిక్‌ కమిటీ ఈ ఆతిథ్యం, క్రీడలను ఎప్పటకీ మరువలేదు. మన అందరిని ఏకం చేసే శక్తి క్రీడలు, ఆసియా క్రీడలకు ఉన్నాయి. హాంగ్జౌలో ఆసియా క్రీడల జ్యోతి త్వరలోనే ఆరిపోవచ్చు కానీ ఇక్కడ అందించిన స్ఫూర్తి మాత్రం ఆసియా క్రీడల చరిత్రలో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. 19వ ఆసియా క్రీడలు ముగిసినట్టుగా ప్రకటిస్తున్నాను' అని రాజ రణధీర్‌ సింగ్‌ అన్నారు. ఆతిథ్య చైనా 383 మెడల్స్‌తో (201 పసిడి, 111 సిల్వర్‌, 71 బ్రాంజ్‌) అగ్రస్థానంలో నిలువగా.. జపాన్‌ (188), దక్షిణ కొరియా (190) టాప్‌-3లో నిలిచాయి. భారత్‌ 28 పసిడి,38 రజతాలు, 41 కాంస్యాలతో 107 మెడల్స్‌ సొంతం చేసుకుని ఆసియా క్రీడల చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పతకాల పట్టికలో నాల్గో స్థానంలో హాంగ్జౌ ఆసియా క్రీడలను ఘనంగా ముగించింది.
శ్రీజేష్‌ జయహో.. : ముగింపు వేడుకల్లో భారత బృందానికి హాకీ ఇండియా మాజీ కెప్టెన్‌, వెటరన్‌ గోల్‌కీపర్‌ పి.ఆర్‌ శ్రీజేష్‌ వ్యవహరించారు. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత మెన్స్‌ హాకీ జట్టు పసిడి పతకం సాధించిన సంగతి తెలిసిందే. గోల్డ్‌ మెడల్‌ సాధించటంతో పాటు 2024 పారిస్‌ ఒలింపిక్స్‌కు భారత్‌ నేరుగా అర్హత సాధించింది. ఆసియా క్రీడల ముగింపు వేడుకల్లో జాతీయ పతాకధారిగా నిలువటం ఎంతో గర్వకారణమి శ్రీజేష్‌ తెలిపాడు.