Apr 23,2023 10:32

న్యూయార్క్‌ : ప్రపంచంలో హిమనదాలు గతేడాది గణనీయ వేగంతో కరిగిపోయాయని, ఆ వేగాన్ని అరికట్టడంలో, వాటిని కాపాడుకోవడంలో మనం విఫలమవుతున్నామని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. హిమ నదాలు కరగడాన్ని వాతావరణ మార్పులకు ప్రధాన సూచికగా పరిగణిస్తారు. గత 8ఏళ్ళూ అత్యంత వేడిమిగానే వున్నాయని, మరోవైపు కార్బన్‌ డయాక్సైడ్‌ వంటి కాలుష్య కారక వాయువులు వాతావరణంలో బాగా పేరుకుపోతున్నాయని ఐక్యరాజ్య సమితి ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది. అంటార్కిటికా సముద్రంలో మంచు రికార్డు స్థాయిలో తక్కువగా నమోదైంది. కొన్ని యురోపియన్‌ హిమనదాలు కరిగిపోతూ మొత్తంగా కనుమరుగవుతున్నాయని తన వార్షిక వాతావరణ సమీక్షలో పేర్కొంది. సముద్ర మమాట్టాలు కూడా రికార్డు స్థాయిలో అధికంగా వున్నాయి. 2013-2022 మధ్య కాలంలో ఏడాదికి సగటున 4.62 మిల్లిమీటర్ల చొప్పున సముద్ర మట్టం పెరుగుతూ వచ్చాయి. 1993-2002 మధ్య కాలంలో పెరిగిన దానితో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపుగా వుంది. మహా సముద్రాల్లో కూడా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాలుష్య కారక వాయువుల వల్ల భూమిపై పెరిగే వేడిలో 90శాతాన్ని సముద్ర జలాలు గ్రహిస్తాయి.