Oct 06,2023 21:48

న్యూయార్క్‌లోని న్యూయార్క్‌ టైమ్స్‌ ఎదుట నిరసన
న్యూయార్క్‌: భారతదేశంలోని మీడియా సంస్థ న్యూస్‌క్లిక్‌పై దాడిని నిరసిస్తూ న్యూయార్క్‌లో జర్నలిస్టులు, కార్యకర్తలు. న్యూయార్క్‌ టైమ్స్‌ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. న్యూస్‌క్లిక్‌పై దాడుల వెనుక న్యూయార్క్‌ టైమ్స్‌ అబద్ధాలు ఉన్నాయని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసన తెలిపారు. నిరసనకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.
ఆగస్టులో న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన పరిశోధనాత్మక నివేదికలో న్యూస్‌క్లిక్‌ చైనా పార్టీల నుండి నిధులు పొందిందని ఆరోపించింది. దీంతో ఢిల్లీ పోలీసులు గత కొద్ది రోజులుగా న్యూస్‌క్లిక్‌ కార్యాలయాలు, జర్నలిస్టుల ఇళ్లపై దాడులు చేశారు. న్యూస్‌క్లిక్‌తో సంబంధాలున్నాయనే కారణంతో ఇతర సామాజిక కార్యకర్తల ఇళ్లపై కూడా దాడులు చేశారు.న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన అబద్ధాలలో భాగమే న్యూస్‌క్లిక్‌కు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం చేసిన ఇటువంటి చర్యలు అని నిరసనకారులు అన్నారు. మోడీ, అమిత్‌ షాలు ఈ అబద్ధాలను ప్రామాణికంగా చూపిస్తున్నారని ఆందోళనకారులు ఎత్తిచూపారు. నిజాలు చెప్పినందుకు మీడియాను వేటాడే మోడీ ప్రభుత్వ ఫాసిస్ట్‌ వైఖరికి వ్యతిరేకంగా నిరసనకారులు మండిపడ్డారు. భారతదేశంలోని రైతు పోరాటాన్ని వెలుగులోకి తెచ్చినందుకు, నిజాలను నిర్భయంగా బయటపెట్టినందుకు న్యూస్‌క్లిక్‌పైన, అందులో పనిచేస్తున్న, గతంలో పని చేసిన జర్నలిస్టులను మోడీ ప్రభుత్వం నిరంకుశంగా దాడులు చేస్తోందని నిరసనకారులు పేర్కొన్నారు.