Apr 19,2023 22:05

-వివరణ ఇవ్వాల్సిందేనన్న చైనా
న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్‌పైన, ఇతర ఐరాస అధికారులపైన అమెరికా గూఢచర్యానికి పాల్పడడంపై ఐరాస ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ గూఢచర్యంపై ఐరాస తన ఆందోళనను అమెరికాకు లాంఛనంగా తెలియజేసంది. దీనిపై చైనా మరో అడుగు ముందుకేసి ఈ గూఢచర్యంపై అమెరికా బాధ్యతాయుతమైన రీతిలో వివరణ ఇవ్వాలని కోరింది. అమెరికా తన మిత్ర దేశాలపైనే కాకుండా, ప్రపంచ సంస్థ చీఫ్‌పైనా, ఇతర అధికారులపైన గూఢచర్యానికి పాల్పడిన వైనాన్ని ఇటీవల లీకైన పెంటగాన్‌ పత్రాలు స్పష్టంగా బయటపెట్టాయి. ఐక్యరాజ్యసమితికి ఆతిధ్యమిస్తున్న దేశంగా అమెరికా ఇటువంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు అని, అంతర్జాతీయ సమాజానికి అది వివరణ ఇవ్వాలని పలు దేశాలు కోరాయి. . ఐరాస స్వతంత్రతకు, స్వేచ్ఛకు భంగం కలిగించే రీతిలో అమెరికా వ్యవహరించడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని అవి పేర్కొన్నాయి. ఐరాసకు అతిధ్యమిచ్చే దేశంగా అమెరికా దాని బాధ్యతలను నెరవేర్చేందుకు కొన్ని కచ్చితమైన చర్యలు చేపట్టాలని, దీనిపై వివరణ ఇవ్వకుండా అది తప్పించుకోజాలదని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఐరాసపై అమెరికా ఈ విధంగా గూఢచర్యానికి పాల్పడడం ఇదే తొలి సారి కాదు. 2013లో ఒకసారి ఇదే విధంగా ఐరాసపై అది నిఘా పెట్టినట్లు 'ప్రిజమ్‌' రహస్య పత్రాలు వెల్లడించాయి.