కమలం చేజారుతున్న రాష్ట్రాలు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి చేతిలోనుంచి మరో రాష్ట్రం తగ్గింది. ఇప్పుడు బిజెపి అధికారం 15 రాష్ట్రాల్లోనే మిగిలింది. సొంత బలంతో 6 రాష్ట్రాల్లో, మిత్రపక్షాలతో 9 రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వం నడుస్తోంది. దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ బిజెపి ప్రభుత్వంలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి గరిష్ట ఉనికిని కలిగిఉన్నది. వాస్తవానికి బిజెపికి ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా.. అక్కడ ఉన్న బిజెపియేతర ప్రభుత్వాలను అడ్డదారుల్లో కూల్చి అధికారమెక్కినవే అధికం గా ఉన్నాయన్నది నిర్వివాదాంశం.
ఐదేళ్లలో ఏం జరిగిందంటే..
మే 2018 నుంచి మే 2023 వరకు అంటే ఐదేళ్లలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికలను విశ్లేషిస్తే.. దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, అందులో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే బిజెపి సంపూర్ణ మెజారిటీ సాధించింది. మరో 16 రాష్ట్రాల్లో ఇతరుల మద్దతుతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది.
ఎన్నికల తీరుతెన్నులు..
ప్రస్తుతం దేశంలో 30 శాసన సభలు ఉన్నాయి. వీటిల్లో రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి కూడా ఉన్నాయి. కర్ణాటక ఫలితాల తర్వాత 15 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. ఇందులో ఒక్కటి దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు లేవు. 2018లో బిజెపి 21 రాష్ట్రాలను, దేశ జనాభాలో 71శాతం మందిని పాలించింది. ఇప్పుడు ఆ జనాభా 45 శాతానికి తగ్గిపోయింది. ప్రస్తుతం బిజెపి లేదా దాని భాగస్వామ్య పార్టీలు అధికారంలో ఉన్న ఏడు రాష్ట్రాల జనాభా కోటి కంటే ఎక్కువ.
సౌత్ ఇండియా నుంచి బిజెపి క్లీన్ స్వీప్.., ఈశాన్యంలో ముగ్గురు బిజెపి సిఎంలు
ఈశాన్య భారతదేశం (సిక్కింతో సహా)లో 8 రాష్ట్రాల్లో మొత్తం 498 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో బిజెపి నుంచి 206 మంది ఎమ్మెల్యేలు అంటే 41.3% ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి మొత్తం 25 మంది ఎంపిల్లో బిజెపికి 15 మంది ఎంపిలు అంటే 60% ఉన్నారు. అసోంలో హేమంత్ బిశ్వశర్మ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం ఉన్నది. నాగాలాండ్‌లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి) నాయకత్వంలో బిజెపి అధికారంలో ఉంది. ఎన్‌డిపిపికి చెందిన నే నీఫియు రియో ముఖ్యమంత్రిగా ఉన్నారు.. మణిపూర్‌లో స్థానిక పార్టీలైన ఎన్‌పిపి, ఎన్‌పిఎఫ్, కెపిఏలతో కలిసి బిజెపి సంకీర్ణ సర్కార్ నడుస్తోంది. బిజెపికి చెందిన బీరేన్ సింగ్ సీఎంగా ఉన్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి.
మిజోరామ్‌ను మిజో నేషనల్ ఫ్రంట్ పాలిస్తోంది. జోరంతంగా అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. త్రిపురలో బిజెపి అధికారంలో ఉండగా, ఇక్కడ మాణిక్ సాహా ముఖ్యమంత్రి పాలన సాగుతోంది.. అరుణాచల్ ప్రదేశ్‌లో బిజెపి అధికారంలో ఉంది. ఇక్కడ పెమా ఖండూ ముఖ్యమంత్రిగా ఉన్నారు.. సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్‌కెఎం) అధికారంలో ఉంది. ప్రేమ్ సింగ్ తమాంగ్ సిఎం. రాష్ట్రంలో బిజెపి ఎమ్మెల్యేలు లేరు, కానీ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో ఎస్‌కెఎం భాగమే.
పశ్చిమ భారతదేశం (మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్): మహారాష్ట్రలో షిండే నేతృత్వంలోని శివసేనతో బిజెపి ప్రభుత్వం ఉంది. గుజరాత్‌లో బిజెపికి, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ ప్రభుత్వం ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లోని 670 మంది ఎమ్మెల్యేల్లో 331 మంది బిజెపికి చెందిన వారు, అంటే 49%. ఈ రాష్ట్రాల్లోని మొత్తం 99 మంది ఎంపిలలో 73 మంది బిజెపికి చెందిన వారు, అంటే 72%.
తూర్పు భారతదేశం (బీహార్, బెంగాల్, జార్ఖండ్, ఒడిశా) : బీహార్‌లో మహాకూటమి ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్‌లో టిఎంసి ప్రభుత్వం, జార్ఖండ్‌లో జెవిపి ప్రభుత్వం ఉంటే.. ఒడిశాలో బిజెడి ప్రభుత్వం ఉన్నాయి. అంటే తూర్పు భారతదేశంలో ఎక్కడా బిజెపి ప్రభుత్వం లేదు. ఇక్కడ మొత్తం 722 మంది ఎమ్మెల్యేల్లో 196 మంది బిజెపికి చెందిన వారు, అంటే 27%. అదేవిధంగా, ఈ రాష్ట్రాల నుంచి మొత్తం 117 మంది ఎంపిలలో 54 మంది బిజెపికి చెందిన వారు, అంటే 46%.
ఉత్తర భారతం (ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్, యూపి, ఉత్తరాఖండ్): ఉత్తర భారతదేశంలో హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు బిజెపి పాలనలో ఉన్నాయి. ఇక్కడ మొత్తం 818 మంది ఎమ్మెల్యేల్లో బిజెపి నుంచి 377 మంది అంటే 46% ఉన్నారు. మొత్తం 189 ఎంపిల్లో బిజెపికి 98 మంది అంటే 52% ఉన్నారు.
మధ్యభారత్ (ఎంపీ, ఛత్తీస్‌గఢ్) : మధ్యప్రదేశ్‌లో బిజెపి ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి. ఇక్కడ మొత్తం 420 మంది ఎమ్మెల్యేల్లో 144 మంది బిజెపి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అంటే 34% మంది ఉన్నారు. అదేవిధంగా మొత్తం 40 మంది ఎంపిల్లో 37 మంది బిజెపికి చెందిన వారు అంటే 92%.
దక్షిణ భారతదేశం : కర్ణాటక ఓటమి తర్వాత దక్షిణాదిలో బిజెపి ప్రభుత్వం లేదు. దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉన్నాయి. ఇక్కడ మొత్తం 130 మంది లోక్‌సభ ఎంపీలు వచ్చారు. వీరిలో బిజెపికి 29 మంది అంటే 22% మాత్రమే ఉన్నారు. వీరిలో కర్ణాటక నుంచి 25 మంది, తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలు ఉన్నారు.
దక్షిణ భారతదేశంలో మొత్తం 923 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో కేవలం 95 మంది బిజెపి నుంచి ఉన్నారు. అంటే కేవలం 10% మంది మాత్రమే ఉన్నారు.
బెడిసికొట్టిన వ్యూహం..
సార్వత్రికానికి ముందే దక్షిణాది రాష్ట్రాలో తొలిదశగా కర్ణాటకలో అడుగుపెట్టాలని వేసిన బిజెపి వ్యూహం కాస్త బెడిసికొట్టింది. పార్టీలో ఓటమిపై పోస్టుమార్టం మొదలైంది. హిందూత్వం, మత విభజన రాజకీయాలను తెరపైకి తెచ్చినా.. ఓటరన్న తిప్పికొట్టాడు. తాను ఎదుర్కొంటున్న బతుకు భారాలు.. పూట గడవటం గురించి ఆలోచిస్తున్నాడు. దాని ఫలితమే కర్ణాటక ఎన్నికల ఫలితాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.










