సింగపూర్ : విహారయాత్రకు వెళ్లిన ఓ భారతీయ మహిళ కనిపించకుండా పోయిన ఘటన విషాదాంతమైంది. ఆమె కుమారుడు సామాజిక మాధ్యమాల వేదికగా తన తల్లి మరణాన్ని ధ్రువీకరించారు.
రీటా సహానీ (64), జాకేశ్ సహానీ (70) భార్యభర్తలు నాలుగు రోజుల క్రూజ్‌షిప్ విహార యాత్రకు వెళ్లారు. చివరి రోజైన సోమవారం మలేషియాలోని పెనాంగ్ రాష్ట్రం నుంచి సింగపూర్‌కు వస్తుండగా.. జాకేశ్ నిద్రలేచే సమయానికి రీటా గదిలో కనిపించలేదు. దీంతో ఆయన నౌకలోని సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే అప్రమత్తమై తమ ఓవర్‌బోర్డ్ డిటెక్షన్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేశారు. నౌక సింగపూర్ జలసంధిలో ప్రయాణిస్తున్న సమయంలో ఏదో సముద్రంలో పడిపోయినట్లు సిబ్బంది గుర్తించారు. రీటానే జలసంధిలో దూకినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఫుటేజ్ ద్వారా మా అమ్మ చనిపోయిందని తెలిసింది : రీటా కుమారుడు అపూర్వ్ సహానీ
ఈ ఘటనపై రీటా కుమారుడు అపూర్వ్ సహానీ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. తన తల్లి జాడ గుర్తించే ప్రయత్నాల్లో భాగంగా ప్రధాని మంత్రి కార్యాలయం, విదేశాంగ శాఖ సహాయాన్ని కోరారు. అనంతరం మరో పోస్టు చేసిన ఆయన.. తన తల్లి మరణాన్ని ధ్రువీకరించారు. 'నౌక నిర్వాహకులు మాకు ఫుటేజ్‌ను షేర్ చేశారు. గాలింపు కూడా జరుగుతోంది. అలాగే ఆ ఫుటేజ్ ద్వారా మా అమ్మ చనిపోయిందని తెలిసింది' అని పేర్కొన్నారు. దీనిపై సింగపూర్‌లోని భారత కార్యాలయం కూడా స్పందించింది. ఈ ఘటనపై తాము సహనీ కుటుంబం, సింగపూర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.