న్యూఢిల్లీ : సింగపూర్‌కు బియ్యం ఎగుమతి నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సింగపూర్‌తో ఉన్న ''ప్రత్యేక సంబంధం'' దృష్ట్యా బియ్యం ఎగుమతికి అనుమతించాలని నిర్ణయించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) తెలిపింది. ఆ దేశంలో నెలకొన్న ఆహార భద్రతా అవసరాలను తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. బియ్యం ఎగుమతులపై మీడియా ప్రశ్నలకు ఎంఇఎ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మంగళవారం సమాధానం ఇచ్చారు. భారత్ మరియు సింగపూర్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని, భాగస్వామ్య ఆసక్తులు, సన్నిహిత ఆర్థిక సంబంధాలు, మరియు బలమైన వ్యక్తుల మధ్య అనుసంధానం ద్వారా వర్గీకరించబడతాయని చెప్పారు. ఎగుమతులకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు త్వరలో జారీ చేయబడతాయని అన్నారు.
గత ఆదివారం బాస్మతీయేతర తెల్ల బియ్యం తప్పుడు లెక్కలు, అక్రమ ఎగుమతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో నివేదికలు అందాయని ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. బాస్మతియేతర తెల్ల బియ్యం హెచ్‌ఎస్ కోడ్ ఆప్ ఉప్పుడు బియ్యం, బాస్మతి బియ్యం కింద ఎగుమతి అవుతున్నాయని పేర్కొంది. అయితే ఈ బియ్యాన్ని జులై 20న నిషేధిత జాబితాలో చేర్చామని ప్రభుత్వం వెల్లడించింది.