Aug 04,2023 10:25
  • వరద బాధిత ముంపు గ్రామాల ప్రజల ఆవేదన
  • కిలో బంగాళాదుంపలు, అరకేజీ బెండకాయల, అరలీటరు పాలు

 

చింతూరు, ఎటపాక నుంచి వల్లభనేని సురేష్‌

''వరద ముంపుతో వెళ్లగొట్టేయాలని చూస్తున్నారు. 12 రోజులు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినా అడిగినవారు లేరు. కనీసం మంచినీరూ ఇవ్వలేదు''. అని పోలవరం ముంపు గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. వారి బాధలు చూసి పరామర్శించేందుకు వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముందు తమగోడు వెళ్లబోసుకున్నారు. గతంలో భద్రాచలం వద్ద గోదావరి 42 అడుగలకు నీరొస్తే తమ గ్రామాలకు ముంపు ఏర్పడేది, ఇప్పుడు 32 అడుగులు నీరొస్తేనే మునిగిపోయాయని, ఇది సహజంగా వచ్చిన వరద కాదని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎటపాక, కూనవరం, విఆర్‌.పురం, చింతూరు మండలాల్లో నెల్లిపాక, లక్ష్మీపురం, వీరాయిగూడెం, చింతూరు, టేకులబోరు, సున్నంవారిపల్లి, బాసవాగు తదితర ప్రాంతాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం తదితరులు పర్యటించారు. ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. బాధితులను అడిగి వివరాలు తెలు సుకున్నారు. ఈ క్రమంలో అనేక అంశాలు వెలుగు లోకి వచ్చాయి. వరద ముంపు మొదలైనప్పటి నుండి అధికారులెవరూ తమ గ్రామాల్లోకి రాలేదని నెల్లిపాక పంచాయతీ సర్పంచ్‌ కుర్సా భద్రమ్మ తెలిపారు. వీరాయిగూడెం పంచాయతీకి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయని, రేకులషెడ్లు కూడా పూర్తిగా మునిగిపోయేంత వరద వచ్చిందని తెలి పారు. తమ గ్రామం 45.72 మీటర్ల కాంటూరులో ఉందని, అయినా భద్రాచలం వద్ద 30 అడుగుల నీరు రాగానే గ్రామం మునిగిపోయిందని, 12 రోజులపాటు వచ్చేందుకు వెళ్లేందుకు మార్గం లేదని తెలిపారు. దీనిపై అధికారులను పడవ ఏర్పాటు చేయాలని కోరగా చివర్లో ఒక పడవ వచ్చిందని అప్పటికి వరద తగ్గిందని తెలిపారు. తమ గ్రామం చుట్టూ మునిగిపోయిందని, అయినా తాము ముంపు బాధితులం కాదని అంటున్నారని, ఆదెక్కడి న్యాయమని నెల్లిపాకకకు చెందిన వీరమ్మ పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు కూడా ఇవ్వలేదని తెలిపారు. గిద్దెడు బియ్యం ఇవ్వలేదని, కూరగాయాలు కూడా రెండు రోజుల క్రితం కొంచెం కొంచెం ఇచ్చారని, .పది రోజులకు కిలో కూరగాయలు ఎలా సరిపోతాయని నెల్లిపాకకు చెందిన నాగలక్ష్మి కోరారు. శబరి నది నీరు వెనక్కు తన్నుకొచ్చి తమ ఇళ్లు మునిగిపోయాయని చింతూరుకు చెందిన మహ్మద్‌ హుస్సేన్‌ తెలిపారు. మూడురోజులపాటు నీళ్లు అలాగే ఉన్నాయని, హైస్కూల్లో సామాన్లు పెట్టుకుని పడుకుంటున్నా మని వారం రోజులకు కలిపి కిలోన్నర కూర గాయలు ఇచ్చాని, అరలీటరు పాలప్యాకెట్‌ ఇచ్చి సర్దుకోమన్నారని తిరుపతమ్మ తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అడిగినా సందించడం లేదని, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ బెదిరిస్తున్నారని నాలుగు మండలాలకు చెందిన ముంపు ప్రజలు ముక్తకంఠంతో తెలిపారు. నిన్నటి వరకు స్పందించని ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యమంత్రి పర్యటన ఉందనే పేరుతో బుధ, గురువారాల్లో హడావిడిగా కొద్దిపాటి నిత్యావసర సరుకులు, రూ.2వేల పరిహారం పంపిణీ చేస్తున్నారు.
 

                                                                       పాస్టర్ల వినతి

ముంపు గ్రామాల ప్రజలకు న్యాయం చేయా లని ఎటపాక మండల పాస్టర్ల ఫెలోషిప్‌ సభ్యులు సిపిఎం బృందానికి విన్నవించారు. దాదాపు 60 మంది పాస్టర్లు తమకు న్యాయం చేయించాలని కోరారు. దీనికి స్పందించిన శ్రీనివాసరావు న్యాయం చేసేలా పోరాటం చేస్తామని అన్నారు. అలాగే కేంద్రం మతపరంగా ప్రజలను విడగొట్టేందుకు చూస్తోందని, దీనిపైనా అందరూ ఐక్యంగా పోరాడాలని సూచించారు. మణిపూర్లో మతం పేరుతో మారణ హోమం చేస్తున్నారని, దీనిపైనా తిరుగుబాటు చేయాలని వారికి సూచించారు.
 

                                                      కిందే కూర్చుంటున్న ఇంటర్‌ విద్యార్థినులు

నెల్లిపాకలో ముంపునకు గురైన ప్రభుత్వ జూని యర్‌ కళాశాలను సిపిఎం బృందం పరిశీలించింది. అక్కడ విద్యార్థినులు నేలపైనే కూర్చుని పాఠాలు వింటుండటాన్ని చూసి ప్రిన్సిపల్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డెస్కులు వేయించేలా తాము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని ప్రిన్సిపల్‌కు సూచించారు. ఈ పర్యటనలో సిపిఎం రాష్ట్ర కార్య దర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, రంపచోడ వరం జిల్లా కార్యదర్శి బి.కిరణ్‌, నాయకులు ఎం.నాగేశ్వరరావు, ఐ.వెంకటేశ్వరరావు, వై. శ్రీనివాసరావు, సీసం సురేష్‌, పల్లపు వెంకట్‌ పాల్గొన్నారు.