Jul 08,2022 07:03

రాష్ట్ర ప్రభుత్వం తరగతుల విలీనం పేరుతో పాఠశాలలు మూతపడే పరిస్థితిని సృష్టించడం దారుణం. 'మా ఊరిలో పాఠశాలను మూసివేయొద్దు' అని విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలినాడే రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు, పిల్లలు ఆందోళనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడడం అత్యంత విచారకరం. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్దీకరణ, నూతన విద్యా విధానం అమలు పేరుతో స్కూళ్ల సంఖ్యను, ఉపాధ్యాయుల సంఖ్యను కుదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం తగదు. ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా చేరారని విద్యాశాఖ మంత్రే స్వయంగా తెలిపారు. మరి వీరందరినీ చేర్చుకోవడానికి ఎక్కడా కొత్త పాఠశాలలు తెరవలేదు; ఉపాధ్యాయులనూ కొత్తగా నియమించలేదు. పైపెచ్చు జివో 117ను తీసుకొచ్చి ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని1:35 నుంచి 1:53కి, ఉన్నత పాఠశాలల్లో 1:40 నుంచి 1:60కి పెంచుతామన్నారు. ఉన్నత పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకే సరిపడ తరగతి గదులు లేక, పాఠాలు చెప్పే టీచర్లు సరిపోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి పెరగడం అంటే 'మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన' అన్న చందమే కదా! ప్రస్తుతం 7,900 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. వాటి సంఖ్య కూడా మరింతగా పెరగనుంది. ఇప్పటికే అనేక సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేరు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన ఇలాంటి చర్యలతో విద్యా నాణ్యత పెరగడం అసాధ్యమవుతుంది.
         ఉన్నత పాఠశాలలకు కిలోమీటరు దూరంలోపు ఉన్న 9,771 ప్రాథమిక పాఠశాలలను విలీనం పేరుతో మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేరుకు ఒక్క కిలోమీటరు అంటున్నా ఆచరణలో అది ఇంకా ఎక్కువగానే ఉంటుంది. దాంతో వేలాదిమంది విద్యార్థులు అధిక దూరం ప్రయాణించాల్సి వస్తుంది. వాగులు, వంకలు దాటవలసివస్తుంది. అలాగే ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే రోడ్లపై చిన్న పిల్లలు ప్రయాణించాలి. కొన్ని రైల్వే క్రాసింగులూ దాటవలసిరావచ్చు. చదువు సంగతి ఎలా ఉన్నా బండెడు పుస్తకాలు మోసుకొని కిలోమీటర్ల పర్యంతం నడవడం విద్యార్థులకు దినదిన గండంగా మారుతుంది. ఇటువంటి అననుకూల పరిస్థితుల్లో విద్యార్థినులు చదువు మధ్యలోనే మానుకునే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పటికే బాలికా విద్యలో వెనుకబడిన రాష్ట్రం సర్కారు చర్యల ఫలితంగా మరింత వెనుకబడిపోవడం ఖాయం. తమ గ్రామాల్లో బడులు ఉంచాలని అనేకచోట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం విలీన ప్రక్రియను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ప్రపంచ బ్యాంకు రుణంతో తెచ్చిన సాల్ట్‌ పథకాన్ని సర్కారు మొండిగా అమలు చేస్తే ప్రతికూల పర్యవసానాలు తప్పవు. గత అనుభవాల పాఠమదే!
          కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం దేశ విదేశీ కార్పొరేట్లకు ఉపయోగపడుతుంది తప్ప సామాన్యులకు కాదు. నిజానికి రాష్ట్రప్రభుత్వం దాన్ని వ్యతిరేకించవలసిందిపోయి పూర్తిస్థాయిలో అమలు చేయడానికి పూనుకోవడం దారుణం. మరోవైపు పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలను కూడా ఈ పాఠశాలల విలీన ప్రక్రియలోకి తీసుకురావడం మరింత గందరగోళానికి దారితీసింది. ప్రీ ప్రైమరీ విద్య గరపడం మొదలు గర్భిణీలకు ఆహారాన్ని వండిపెట్టడం వరకూ బాధ్యత వారిదేనంటున్న సర్కారు నిధులు, వసతి కల్పన విషయంలో అంగన్‌వాడీలకు మొండి చెయ్యి చూపడం సబబు కాదు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మొత్తాన్నీ అస్తవ్యస్తం చేస్తున్న ఈ నిర్ణయాలపై ప్రభుత్వం వెంటనే పునరాలోచించాలి. విద్యావేత్తలను, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలను, ప్రజా ప్రతినిధులను సంప్రదించాలి. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించేందుకు అవసరమైన వైఖరి చేపట్టాలి. ఆ దిశగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే దీర్ఘకాలంలో రాష్ట్రం తీవ్ర నష్టానికి గురవుతుంది. సర్కారు దారికి రాకపోతే విద్యార్థులు, ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులూ ఆందోళన ఉధృతం చేయక మానరు.