Feb 21,2023 07:07
  • గిరిజన విద్యార్థులకు సకాలంలో అందని వైద్యం
  • ఆరోగ్య కార్యకర్తల తొలగింపుతో సమస్య జఠిలం

ప్రజాశక్తి- పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా), గుమ్మలక్ష్మీపురం (పార్వపురం మన్యం జిల్లా) : అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో మృత్యుఘోష వినిపిస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరోగ్య కార్యకర్తలను తొలగించిన ఫలితంగా సమస్య జఠిలమైంది. సుదూర ప్రాంతాల నుంచి కుటుంబాన్ని విడిచిపెట్టి ఆశ్రమాల్లో విద్యాభ్యాసం కోసం వస్తున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారని, సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, రంపచోడవరం డివిజన్లలో గత నవంబర్‌ నుంచి ఇప్పటివరకు తొమ్మిది మంది అనారోగ్యంతో మృతి చెందారు. రంపచోడవరం డివిజన్‌ దేవీపట్నం మండలం ముసినిగుంట గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థిని పి.యమునశ్రీ ఈ నెల 16న, ఇదే పాఠశాల పదో తరగతి విద్యార్థిని కానెం ఈశ్వరిదేవి ఈ నెల తొమ్మిదిన అనారోగ్యంతో మృతి చెందారు. పాడేరు డివిజన్‌ జి.మాడుగుల మండలం బంధవీధి ఆశ్రమ బాలికల పాఠశాల ఆరో తరగతి విద్యార్థిని కొర్ర కవిత ఈ నెల 17న, పాడేరు గురుకుల పాఠశాల ఇంటర్‌ విద్యార్థిని హారిక గత నవంబర్‌లోనూ మరణించారు. పాడేరు నెంబర్‌ వన్‌ పాఠశాల ఏడో తరగతి విద్యార్థి పాంగి నవీన్‌, జి.మాడుగుల గురుకుల పాఠశాల విద్యార్థి కొండబాబు, పాడేరులోని తలారిసింగి సిఎహెచ్‌ స్కూలు విద్యార్థి ఒకరు అనారోగ్యానికి గురై మృతి చెందారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో గత 15 రోజుల్లో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. వారిలో సీతంపేట మండలం పూతికవలస గిరిజన బాలికల వసతి గృహ పదో తరగతి విద్యార్థిని కొండగొర్రి పవిత్ర, కొమరాడ మండలం ఉలిపిరి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని సుమిత్ర, మక్కువ కెజిబివి పాఠశాల ఇంటర్మీడియట్‌ విద్యార్థిని కొండగొర్రి యోగీశ్వరి ఉన్నారు. ఇవన్నీ రికార్డుల్లోకి ఎక్కిన మరణాలు. రికార్డులు ఎక్కని మరణాలు ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చని గిరిజనులు అంటున్నారు.

  • అన్నిచోట్లా అనారోగ్య పరిస్థితులు

గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఉంటున్నారు. వాటిలో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలను ప్రభుత్వం తొలగించింది. అప్పటి నుంచి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు క్షీణించాయి. ఆశ్రమాల్లో మౌలిక సౌకర్యాల కొరతతోపాటు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు మలేరియా, టైఫాయిడ్‌, డయేరియా, కామెర్లు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. సకాలంలో వైద్యం అందక కొందరు మృతి చెందుతున్నారు.

  • విద్యార్థుల మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత : కిల్లో సురేంద్ర, ఎపి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఇటీవల పెరుగుతున్న విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. ఆశ్రమాల్లో విద్యార్థులకు భద్రత కొరవడింది. వారి ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. మూడు నెలలకు ఒకసారి తల్లిదండ్రుల కమిటీ సమావేశం జరపాల్సి ఉన్నా, జరపడం లేదు. విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి.

  • ఆరోగ్య కార్యకర్తలను కొనసాగించాలి : వి.ఉమామహేశ్వరరావు, సిఐటియు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి

2001 నుంచి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలను కరోనా కాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఆశ్రమాల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా వెంటనే వీరందరినీ విధుల్లోకి తీసుకోవాలి.

  • చాలీచాలని మెస్‌ఛార్జీలతో పోషకాహార సమస్య : వి.మహేశ్వరరావు, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

ఆశ్రమాల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై ప్రభుత్వం తక్షణమే స్పందించి మౌలిక సౌకర్యాలు మెరుగుపరచాలి. చాలీచాలని మెస్‌ఛార్జీల వల్ల పోషకాహార కొరతతో విద్యార్థులు రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవలసిన అధికారులు పట్టించుకోవడం లేదు.

  • సమాచారం అందిన వెంటనే స్పందిస్తున్నాం : కె.లీలాప్రసాద్‌, అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య శాఖాధికారి

విద్యార్థులు మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాల బారిన పడుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల అనారోగ్య పరిస్థితులపై మాకు సమాచారం అందిన వెంటనే స్పందించి తక్షణ వైద్య సేవలు అందిస్తున్నాం. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు తాగునీరు, ఆహారం కలుషితమైనప్పుడు, పరిశుభ్రత లోపించినప్పుడు, ఉడకని ఆహార పదార్థాలు తిన్నప్పుడు డయేరియా వంటి అనారోగ్య పరిస్థితులు ఎదురవుతున్నాయి.