Oct 16,2023 14:57
  • రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ అప్పారావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దసరా సెలవుల్లో ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ కేసలి అప్పారావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రకటించిన దసరా సెలవుల్లో విద్యా సంస్థలు తరగతులు లేదా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించినా తప్పక ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం మంగళగిరిలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ కార్యాలయంలో అప్పారావు మాట్లాడుతూ.. కొన్ని జిల్లాల్లో సెలవుల విషయంలో ప్రభుత్వ నియమ, నిబంధనలను కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు పాటించడం లేదని కమిషన్‌ కార్యాలయానికి ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయని, మరికొన్ని విద్యాసంస్థలు మొబైల్‌ ఫోన్‌ ద్వారా హోమ్‌వర్కులు చేయాలని బాలలకు ఒత్తిడి తీసుకొస్తున్నాయని పేర్కొన్నారు. మండల, జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, తరగతులు నిర్వహిస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని ఆదేశించారు.