Aug 26,2023 20:13
  •  బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ అప్పారావు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పాఠశాలల్లో ఉపాధ్యాయులు వివిధ మతాలకు, కులాలకు అతీతంగా విద్యాబోధన చేపట్టాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ కేసలి అప్పారావు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కాలంలో కొన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులు మత ప్రచారాలు చేస్తుండటంతోపాటు కులాల ప్రస్తావన తీసుకొస్తున్నట్లు కమిషన్‌ దృష్టికి వచ్చిందన్నారు. ఏ విధమైన మత ప్రచారాలను పాఠశాలల్లో బోధించడం చేయకూడదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేసినట్లయితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు చదువుతోపాటు నైతిక విలువలు, నీతి, న్యాయం, సేవా గుణం వంటివి నేర్పించాలన్నారు. విద్యార్థులు సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారని, వారి మనసులో కుల, మత, వర్గ భేదాలు వంటి బీజాలు నాటకుండా చూడాలని, వారి మనోభావాలు దెబ్బతినేలా ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది ప్రవర్తించరాదని పేర్కొన్నారు.