Jul 23,2023 09:37
  • ఇంఫాల్‌లో వేలాదిమందితో ఆదివాసీ గిరిజన మహిళల నిరసన ప్రదర్శన
  • ఐదవ నిందితుడి అరెస్టు
     

ఇంఫాల్‌, న్యూఢిల్లీ బ్యూరో : మణిపూర్‌లో మహిళలపై జరిగిన ఆటవిక దాడిని నిరసిస్తూ ఆందోళనలు, నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. నేరస్తులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం మణిపూర్‌లో ఆదివాసీ గిరిజన నాయకుల వేదిక (ఐటిఎల్‌ఎఫ్‌) మహిళా విభాగం ఆధ్వర్యాన వేలాదిమందితో పెద్ద ఎత్తున ప్రదర్శన జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 15వేల మంది ఆందోళనకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రదర్శకులనుద్దేశించి మహిళా సంఘాల నేతలు ప్రసంగించారు. ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఇంఫాల్‌ సౌత్‌కి 65కిలోమీటర్ల దూరంలో కుకీలకు పట్టు గల చురచందాపూర్‌లోని 'వాల్‌ ఆఫ్‌ రిమెంబరెన్స్‌' వద్ద ఈ ప్రదర్శన జరిగింది. మణిపూర్‌ హింసలో మరణించిన తమ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారి డమ్మీ శవపేటికలను అక్కడ వుంచారు. కుకీ మహిళల మానవ హక్కల సంఘం ఛైర్‌పర్సన్‌ ఎంగ్‌యిన్‌నికిమ్‌ మాట్లాడుతూ, ఈ దారుణాల వెనక గల వ్యక్తి మెజారిటీ మెయితి కమ్యూనిటీకి చెందిన సింగ్‌ అని విమర్శించారు.
 

                                                           సోమవారం ప్రతిపక్షాల నిరసన

మణిపూర్‌పై ప్రధాని ప్రకటనకై పట్టుబడుతూ ప్రతిపక్ష ఎంపీలు సోమవారం పార్లమెంట్‌ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన నిర్వహించనున్నారు. సోమవారం పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో చర్చించిన అనంతరం వారు సభకు హాజరవడానికి ముందుగా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపడతారు. ప్రతిపక్షాలు ఎటువంటి సమయ పరిమితులు లేకుండా అన్ని పార్టీలు మాట్లాడటానికి అనుమతించేలా చర్చను కోరుతున్నాయి.
 

                                                 చర్యలు తీసుకోవాలి : రాష్ట్రాల మహిళా కమిషన్లు

మణిపూర్‌ వీడియో ఘటనపై చర్యలు తీసుకోవాలని వివిధ రాష్ట్రాల మహిళా కమిషన్లు డిమాండ్‌ చేశాయి. కాగా, తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మేఘాలయ మహిళా కమిషన్‌ డిమాండ్‌ చేసింది. మిజోరాం స్టేట్‌ కమీషన్‌ ఫర్‌ ఉమెన్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ ఉమెన్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ, నాగ మదర్స్‌ అసోసియేషన్‌ కూడా బాధితులకు న్యాయం చేయాలని, అందరు మహిళలు, బలహీన వర్గాలకు సురక్షితమైన వాతావరణం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ మహిళా కమిషన్‌, మణిపూర్‌ ప్రభుత్వానికి లేఖలు రాశాయి. తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో మహిళా సంఘాలు నిరసనలు నిర్వహించాయి. ఢిలీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మలాల్‌ ఆదివారం మణిపూర్‌లో పర్యటించి, పరిస్థితులను సమీక్షించి, నిజ నిర్ధారణ నివేదికను అందచేస్తారు.
 

                                                    ఆటవికం, సిగ్గుచేటు : ప్రముఖుల ఆందోళన

మణిపూర్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిర్మాతలు, సంగీత కళాకారులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలతో సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఘటనను ఆటవిక చర్యగా అభివర్ణించారు. నేరస్తులకు కఠిన శిక్ష విధించాలని కోరారు. ఒడిషాలో నిర్మాతలు, రచయితలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు ఈ ఘటనను తీవ్రం గా ఖండించారు. భువనేశ్వర్‌ లోని మాస్టర్‌ కేంటీన్‌ స్క్వేర్‌ వద్ద ధర్నా నిర్వహించారు.
 

                                                                 ఐదవ నిందితుడి అరెస్టు

మణిపూర్‌ ఘటనకి సంబంధించి పోలీసులు ఐదవ నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని 19ఏళ్ళ వ్యక్తిగా గుర్తించారు. దీంతో ఈ ఘటనలో ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య ఐదుకు చేరింది. నలుగురు నిందితులను 11 రోజుల పోలీసు కస్టడీకి శుక్రవారం పంపారు.
 

                                                తక్షణమే న్యాయం : నాగా గ్రూపుల డిమాండ్‌

అమానుషమైన ఈ ఘటనను ఖండిస్తూ తక్షణమే బాధిత మహిళలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మణిపూర్‌ నాగా గ్రూపులు డిమాండ్‌ చేశాయి. యునైటెడ్‌ నాగా కౌన్సిల్‌, ఆల్‌ నాగా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ మణిపూర్‌ సహా పలు నాగా గ్రూపులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి.
 

                                                        10మంది నాగా ఎమ్మెల్యేల ఖండన

మణిపూర్‌లో 10మంది నాగా ఎమ్మెల్యేలు ఈ దారుణాన్ని ఖండించారు. వీరిలో తొమ్మిది మంది బిజెపి దాని మిత్రపక్షాలకు చెందినవారు. ఈ నెల 20నే వీరు లాంగోల్‌లో పత్రికా సమావేశం పెట్టి ఖండించారు. బాధిత కుటుంబాలకు నాగా ఎంఎల్‌ఎల ఫోరం తన పూర్తి సంఘీభావాన్ని తెలియచేస్తోందన్నారు.