- ప్రభుత్వ కక్షపూరిత చర్య
ప్రజాశక్తి - నౌపడ:శ్రీకాకుళం జిల్లా సంతబమ్మాళి మండలం మూలపేటలోని గ్రీన్‌ఫీల్డ్ పోర్టు భూసేకరణకు భూములు ఇవ్వని రైతుల పొలాల్లోని పంటలను రెవెన్యూ అధికారులు బుధవారం ధ్వంసం చేశారు. మూలపేటలోని సుమారు 20 మంది రైతులు పోర్టుకు భూములివ్వలేదు. భూములివ్వని వారు, భూములిచ్చిన వారు తమ భూముల్లో పంటలను పండిస్తున్నారు. పోర్టు భూసేకరణ నోటిఫికేషన్ పరిధిలోని ప్రాంతాల్లో భూములను చదును చేయాలన్న కలెక్టర్ ఆదేశాలతో టెక్కలి డిఎస్‌పి బాలచంద్రారెడ్డి నేతృత్వాన పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు పొలాల వద్దకు చేరుకున్నారు. యంత్రాలతో పంట పొలాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న మూలపేట నిర్వాసితులు పొలాల వద్దకు వెళ్లి అధికారులను ప్రశ్నించారు. కనీసం సమాచారం ఇవ్వకుండా పొలాలను ధ్వంసం చేయడం ఏమిటని తహశీల్దార్ చలమయ్యను నిలదీశారు. తాము ప్రభుత్వానికి భూములు ఇవ్వలేదని, అటువంటప్పుడు ఎలా ధ్వంసం చేస్తారని ప్రశ్నించారు. పరిహారం పూర్తిస్థాయిలో అందించకుండా పంటలను ఎందుకు తొలగిస్తున్నారని భూములు ఇచ్చిన రైతులు ప్రశ్నించారు. కలెక్టర్ ఆదేశాల మేరకే చేస్తున్నామని, ఏమైనా ఉంటే కలెక్టర్, టెక్కలి సబ్‌కలెక్టర్‌తో మాట్లాడాలని తహశీల్దార్ సూచించారు. దీంతో రైతులు యంత్రాలను అడ్డుకున్నారు. మీ డిమాండ్లను సబ్ కలెక్టర్‌కు తెలియజేయాలని, యంత్రాలను అడ్డుకుని ఇబ్బందులు సృష్టించవద్దని పోలీసులు హెచ్చరించారు. కొంత సమయం కావాలని రైతులు అడిగినా అధికారులు వినిపించుకోలేదు. పోలీసు బందోబస్తు మధ్య రాత్రి కూడా పొలాలను చదును చేశారు.










