Oct 20,2023 10:17
  • మోడీ ప్రభుత్వ నాటకాలను బయటపెట్టాలి
  • దేశవ్యాపిత నిరసనలకు ఎఐకెఎస్‌ పిలుపు

న్యూఢిల్లీ : రైతులకు, రాయితీలతో కూడిన పంటల వైవిధ్యతకు ప్రోత్సాహక ధరలకు హామీ కల్పిస్తూ 2024-25 రబీ మార్కెటింగ్‌ సీజనుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పి)ను అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) ఖండించింది. అఖిల భారత స్థాయిలో సగటు ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లు ఇస్తున్నామంటూ చెప్పడాన్ని తీవ్రంగా విమర్శించింది. గోధుమలు క్వింటాల్‌కు రూ.150 అధికంగా మద్దతు ధర ఇవ్వడం 2014 నుండి అత్యంత అధికమని ప్రభుత్వం పేర్కొనడం బూటకమని కిసాన్‌సభ విమర్శించింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎంఎస్‌పి ప్రకటిస్తారనే వాస్తవాన్ని ఎవరైనా దృష్టిలో పెట్టుకుంటే ఇది బూటకమని స్పష్టంగా వెల్లడవుతుందని ఎఐకెఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌ ధావలె, విజూ కృష్ణన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్పత్తి వ్యయమంటూ ప్రస్తావించినది సమగ్ర సి 2 వ్యయం కాదని, అతి తక్కువగా వున్న ఎ2 ప్లస్‌ ఎఫ్‌ఎల్‌ అని ఆ ప్రకటన పేర్కొంది. రైతులను మోసగించేందుకు నిజాయితీ లోపించిన ప్రయత్నమని విమర్శించింది. రైతులను ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌, తెలంగాణా రైతులను తప్పుదారి పట్టించేందుకు బిజెపి ప్రభుత్వం అబద్దాలు చెబుతోందని వారు విమర్శించారు.
             సి2 వ్యయానికి, ఎ2 ప్లస్‌ ఎఫ్‌ఎల్‌ వ్యయానికి చాలా ఎక్కువగా తేడా కనిపిస్తోందని, అలాగే రాష్ట్ర ప్రతిపాదనలకు, సిఎసిపి ప్రతిపాదనలకు కూడా తేడా బాగా వుందని పేర్కొంది. ప్రతి పంటకు క్వింటాల్‌కు రైతులు ఎదుర్కొనే నష్టాలను ఆ ప్రకటనలో వివరించారు. గోధుమ పంటకు క్వింటాల్‌కు సి2 వ్యయాన్ని రూ.2051గా పంజాబ్‌ ప్రభుత్వం అంచనా వేసింది. అదే సమయంలో సిఎసిపి చేపట్టిన ఎ2 ప్లస్‌ ఎఫ్‌ఎల్‌ వ్యయం కేవలం క్వింటాల్‌కు రూ.741గా వుంది. అంటే సి2 వ్యయానికన్నా క్వింటాల్‌కు ఏకంగా రూ.1310 తక్కువగా వుందని ఆ ప్రకటన వివరించింది. పంజాబ్‌లో దాదాపు 35 లక్షల హెక్టార్లలో గోధుమ పంట సాగవుతోంది. ఈ రకంగా పంజాబ్‌ రైతులు ఒక్క గోధుమ పంటకు సంబంధించే ఏకంగా రూ.13,500కోట్లు నష్టపోతున్నారని కిసాన్‌సభ నేతలు వివరించారు. మహారాష్ట్రలో ఏటా గోధుమ రైతుల నష్టం రూ.4640 కోట్లుగా వుంది. చనా (కాబూలీ శనగలు) విషయంలో తెలంగాణా రాష్ట్ర సి2 అంచనా క్వింటాల్‌కు రూ.6055గా వుండగా, ఎ2 ప్లస్‌ ఎఫ్‌ఎల్‌ కేవలం క్వింటాల్‌కు రూ.2290గానే వుంది. అంటే క్వింటాల్‌కు రూ.3765 తక్కువగా వుంది. క్వింటాల్‌ ఎంఎస్‌పిని రూ.9351గా ప్రకటించాలని రాష్ట్రం సూచించింది. అంటే ప్రకటించిన ఎంఎస్‌పి కన్నా క్వింటాల్‌కు రూ.3911 ఎక్కువన్నమాట. ఇక్కడ రైతు హెక్టార్‌కు రూ.58,665 నష్టపోతున్నాడు.
        నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా భారతదేశంలోని రైతులు పదే పదే నష్టపోతున్నారు. మోసగించబడుతున్నారు. పైగా రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది. చివరకు ఏ మాత్రమూ ప్రోత్సాహకరంగా లేని రీతిలో ప్రకటించిన ఎంఎస్‌పి కూడా కేవలం ఊహాత్మకంగానే వుంది. ఎందుకంటే కొనుగోళ్లు లేనందున మెజారిటీ రైతులకు ఇది ఎలాంటి లాభాలను ఇవ్వడం లేదు. అందువల్లే ఎంఎస్‌పికి చట్టబద్ధమైన హామీ కల్పించాలని రైతులు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారని ఎఐకెఎస్‌ పేర్కొంది.
        ప్రభుత్వ వైఖరిని బహిర్గతం చేసేలా, సమాజంలోని అన్ని వర్గాలకు ఈ సమాచారాన్ని చేరవేసేలా చర్యలు తీసుకోవాలని, నిరసన తెలియజేయాలని ఎఐకెఎస్‌ తన శాఖలకు పిలుపునిచ్చింది. పెద్దమొత్తంలో డబ్బును వాణిజ్య ప్రకటనలకు వెచ్చిస్తూ, కార్పొరేట్‌ మీడియాను తమ ప్రచారానికి ఉపయోగించుకుంటున్న బిజెపికి ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని ప్రజలు గుణపాఠం చెప్పాలని కోరింది.

11