Aug 04,2023 10:57
  • రైతులతో కలిసి వరి నాట్లు వేసిన సిపిఎం నాయకులు
  • రెండో రోజూ కొనసాగిన విధ్వంసం
  • సిపిఎం నాయకుల అరెస్టు, విడుదల

ప్రజాశక్తి - నౌపడ (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేటలో అదానీ పోర్టు పరిధిలో రెవెన్యూ అధికారులు ధ్వంసం చేసిన పంట పొలాల్లో రైతులతో కలిసి సిపిఎం నాయకులు గురువారం నాట్లు వేశారు. గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు భూసేకరణకు భూములు ఇవ్వని రైతుల పొలాల్లోని పంటలను అధికారులు బుధవారం ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ పంట పొలాలను సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, జి.సింహాచలం, జిల్లా కమిటీ సభ్యులు ఎన్‌.షణ్ముఖరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొల్లి ఎల్లయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి హెచ్‌.ఈశ్వరరావు గురువారం పరిశీలించారు. మూలపేటలో పర్యటించి బాధిత రైతులు, మహిళలతో మాట్లాడారు. భూసేకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటి వరకు 43 మంది రైతులు 48 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇవ్వలేదని రైతులు తెలిపారు. వీరిలో కొంతమంది పంట వేసుకోగా, దౌర్జన్యంగా బుల్డోజర్లతో పంటను తొక్కించేశారని సిపిఎం నాయకుల వద్ద వాపోయారు. గ్రామస్తులతో సిపిఎం నాయకులు ఒకవైపు మాట్లాడుతుండగా, మరోవైపు తహశీల్దార్‌ చలమయ్య ఆధ్వర్యాన రెవెన్యూ అధికారులు రెండో రోజూ బుల్డోజర్‌తో పంట పొలాలను ధ్వంసం చేశారు. విషయాన్ని తెలుసుకున్న సిపిఎం నాయకులు అక్కడకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నాయకులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టు నిర్మిస్తే తొలుత పునరావాసం కల్పించాలని, పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఏదీ కల్పించకుంటే పంట పొలాలను ఎందుకు నాశనం చేస్తున్నారని తహశీల్దార్‌ను నిలదీశారు. ధ్వంసాన్ని అడ్డుకునేందుకు పోలీసులను ప్రతిఘటించి వెళ్తుండగా పోలీసులు బలవంతంగా వారిని అరెస్టు చేసి నౌపడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని విడుదల చేశారు.