Jul 24,2023 09:37

రామాపురం చుట్టుపక్కల ప్రాంతమంతా పచ్చని చెట్లు, పూలు, పండ్ల తోటలతో కళకళలాడుతూ ఉండేది. అడవి జంతువులన్నీ అక్కడే సేదతీరేవి. ఒకసారి రోడ్డు వెడల్పు పేరుతో ఆ చెట్లను, పండ్లు, పువ్వుల తోటలను పూర్తిగా నరికివేశారు. దీంతో, పచ్చగా ఉన్న ఆ ప్రాంతమంతా ఎడారిగా మారిపోయింది. అడవి జంతువులకు నిలువ నీడ లేకుండా పోయింది. ఆహారం కరువైంది. ఆకలితో అలమటించిన జంతువులన్నీ తమకు ఈ గతి పట్టించిన మనుషులకు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాయి.
       అనుకున్నదే తడువుగా దశల వారీగా రామాపురంపై దండయాత్రకు బయలుదేరాయి. కోతులు ఇళ్లలోకి చొరబడి నానా బీభత్సం చేశాయి. తరువాత ఎలుగుబంట్లు, ఏనుగులు, చివరకు పెద్ద పులి కూడా గ్రామంలోకి చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. గ్రామస్తులంతా చాలా భయపడిపోయారు. ప్రతిరోజూ ఇలా ఎందుకు జరుగుతోంది? వండిన పదార్థాలను తిననివ్వకుండా జంతువులు ఎందుకు ఇలా చేస్తున్నాయి? అంటూ ఆలోచనల్లో పడ్డారు.
        అప్పుడు ఊళ్లో ఓ పెద్దాయన 'చెట్లను నరకడం వలనే మనకీ గతి పట్టింది. మనం అడవి జంతువులకు నిలువ నీడ లేకుండా చేశాం. అందుకే అవి మన మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. కాబట్టి మనమంతా 'పల్లె ప్రకృతి వనాన్ని' ఏర్పాటు చేద్దామ'ని చెప్పాడు. పెద్దాయన నిర్ణయానికి ఊరంతా అంగీకరించి ప్రతి ఒక్కరూ పల్లె ప్రకృతి వనం పేరుతో ఊరికి పక్కనే ఓ ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ పండ్లు, కాయలు, చెట్లను నాటారు. వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకున్నారు. కొన్ని నెలల తర్వాత ఆ ప్రాంతమంతా పచ్చటి వనంలా తయారైంది. క్రమక్రమంగా అడవి జంతువుల రాక తగ్గింది. అవి అక్కడే ఉండి సంతోషంగా గడుపుతున్నాయి. రామాపురం గ్రామస్తులు సంతోషించి ఇకపై చెట్లను నరక కూడదని నిర్ణయించుకున్నారు. తమ ఉపాయం పారి, మనుషుల్లో మార్పు వచ్చినందుకు జంతువులు సంతోషించాయి.
 

- యాడవరం చంద్రకాంత్‌ గౌడ్‌,
94417 62105