Jul 31,2023 07:57

దేశం ఎన్నడో తల దించుకున్నది
ఈ రోజు మరోసారి... అంతే!
ఇంకోసారి తలదించుకోదన్న భరోసా కూడా ఏమీ లేదు
దాని తల ఎన్నడో ఎక్కడో ఎప్పుడో పెట్టుకున్నది!
మతం కుక్కిన మౌఢ్యంతో
మనుషుల బుర్రలు చెదలు పట్టి
దేశాన్ని దిసమొలతో నిరంతరం ఊరేగిస్తూనే ఉన్నారు

కాకపొతే ఇప్పుడు దేశం దేహం
మణిపూర్‌ కుకీ అయ్యింది
గతంలో ఈ దేహం పేరు ఖైర్లాంజీ
ఇంకా వెనక్కిపోతే - గుజరాత్‌
అంతకన్నా వెనక్కి పోతే - కారంచేడు
ఈ దేశపు అణువణువూ
అన్నను చెల్లిపై కొడుకును తల్లిపై
ఉసి గొలిపే వికృతానంద భరితం!

ఒక మతంపై మరో మతం
ఒక కులంపై మరో కులం
ఒక జాతిపై మరో జాతి
మారణకాండ జరిపే ఉన్మాద చరిత్ర ఈ దేశానిది
ఏ వ్యవస్థలూ ఇక్కడ బాధితుల పక్షం వహించవు
ఓట్లు రాబట్టుకోడానికి
సీట్లు గెలుచుకోడానికి
అధికార పీఠాలు అదిమి పట్టుకోడానికి
ప్రాంతాలు ఆక్రమించుకోడానికి
సంపదలు దోచుకోడానికి
ఆధిపత్యం నిరూపించుకోడానికి
పీడిత స్త్రీల దేహాలు ఇక్కడ
నగంగా ఊరేగించబడుతుంటాయి
అసహ్యంగా చేతులతో తడుముతూంటాయి
అత్యాచారాలకు ఆలవాలమౌతుంటాయి!

పోలీస,్‌ సైన్యం, న్యాయవ్యవస్థ
అన్నీ అంతే... ఎంతకు అంతే!

ఉరికే వేట మృగాలకు తిండిని విసిరేసినట్టు
రక్షణ కొరకు తమను ఆశ్రయించిన వారిని
ఉన్మాదులకు స్వయంగా అప్పగించేస్తుంటారు

మౌనం ఓ వ్యూహాత్మక కుట్ర !
మేలు కోవాల్సింది పీడిత జనమే ...
ఆయుధంగా మలుచుకోవాల్సింది మనల్ని మనమే!
 

- పి. మురళీకుమార్‌
9397873331