రాయ్ పుర్: కొద్ది మొత్తంలోనే డబ్బు దొరికితే ఇచ్చేవారు అరుదుగా ఉంటారు. అదే అధిక మొత్తంలో డబ్బు దొరికితే తిరిగిచ్చేసిన వాళ్లను ఎప్పుడైనా చూశారా? ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.45లక్షలు ఉన్న బ్యాగ్‌ను ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం నిజాయతీగా ఇచ్చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నీలాంబర్ సిన్హా రాయ్ పుర్లోని కాయబంధా పోస్ట్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తుంటాడు. శనివారం ఎప్పటిలాగే డ్యూటీలో ఉండగా.. రోడ్డు పక్కన ఓ బ్యాగ్ దొరికింది.
అందులో అన్నీ రూ.500, రూ.2,000ల నోట్లే. వాటి మొత్తం విలువ రూ.45లక్షలు. వెంటనే మరో ఆలోచన చేయకుండా నగదు బ్యాగ్‌ను స్థానిక పోలీసులకు అప్పజెప్పేశాడు. నీలాంబర్ నిజాయతీకి మెచ్చి పోలీసు అధికారులు అతడికి రివార్డు కూడా ఇచ్చారు. ఇంతకీ ఆ డబ్బు ఎవరిదీ అన్న విషయం మాత్రం తెలియరాలేదు. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నీలాంబర్ నిజాయతీని అందరూ మెచ్చుకుంటున్నారు.