Aug 02,2023 21:49
  •  కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలి
  •  వేతన సవరణ, రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌

ప్రజాశక్తి-యంత్రాంగం : 45 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేయాలని, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, జెఎల్‌ఎం గ్రేడ్‌-2 ఎనర్జీ అసిస్టెంట్లకు ప్రొహిబిషన్‌ డిక్లేర్‌ చేయాలని, ఎన్నికల ముందు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యుత్‌ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఆందోళన బాటపట్టారు. పలుచోట్ల ర్యాలీలు, రిలే దీక్షలు చేపట్టారు. ఎపి విద్యుత్‌ స్ట్రగుల్‌ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇపిఎఫ్‌ అమలు అవుతున్న విద్యుత్‌ ఉద్యోగులందరినీ జిపిఎఫ్‌లోకి మార్చాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని, పీస్‌ రేటు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని పెద్దఎత్తున నినదించారు. ఎన్‌టిఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం విటిపిఎస్‌ వద్ద ధర్నాలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ.. ప్రమాదాల్లో మృతి చెందిన కాంట్రాక్ట్‌ కార్మికుల పిల్లలకు ఉద్యోగాలతో పాటు బేసిక్‌ అమలు చేయాలని కోరారు. విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే 10వ తేదీ నుండి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఎఐటియుసి రాష్ట్ర నాయకులు ఏసోబ్‌ మాట్లాడుతూ కార్మికులు చేస్తోన్న న్యాయమైన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని దాసన్న పేట విద్యుత్‌ భవనం వద్ద రిలే నిరాహారదీక్షలను విద్యుత్‌ ఉద్యోగుల జెఎసి చైర్మన్‌ డి.రాజేంద్రప్రసాద్‌ ప్రారంభించి మాట్లాడుతూ విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కర్నూలులో కార్మిక కర్షక భవన్‌ నుండి విద్యుత్‌ భవనం వరకు ప్రదర్శన, ధర్నా చేశారు. విద్యుత్‌ ఉద్యోగుల జెఎసి ఆధ్వర్యంలో విద్యుత్‌ సౌధ ఎదుట నిరవదిక దీక్షలను ప్రారంభించారు. అనంతపురం జిల్లా విద్యుత్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం వద్ద ధర్లాలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు మాట్లాడుతూ విద్యుత్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎపి విద్యుత్‌ ట్రేడ్‌ యూనియన్‌ స్ట్రగుల్‌ కమిటీని ఏర్పాటు చేసి ఆ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గుంటూరులోని బిఆర్‌ స్టేడియం నుండి విద్యుత్‌ భవన్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్‌ఇకి వినతిపత్రం అందజేశారు. కర్నూలులో కార్మిక కర్షక భవన్‌ నుండి విద్యుత్‌ భవనం వరకు ప్రదర్శన, ధర్నా చేశారు. విద్యుత్‌ సౌధ ఎదుట నిరవదిక దీక్షలను ప్రారంభించారు. శ్రీకాకుళం, ఏలూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అనంతరం అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.

12

 

3