భూపాలపల్లి: తెలంగాణలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంపై కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో భేటీ అయింది. తెలంగాణ ఈఎన్‌సీలు మురళీధర్, నాగేంద్రరావు, వెంకటేశ్వర్లు, ఓఎస్‌డీ శ్రీధర్ దేశపాండే, ఎల్ అండ్ టీ ప్రతినిధులు భేటీలో పాల్గొన్నారు. మేడిగడ్డ ఆనకట్ట కుంగిన వ్యవహారంపై ఇంజినీర్లతో కేంద్ర బృందం చర్చించింది. ఆనకట్టకు సంబంధించిన సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించింది. భేటీ అనంతరం తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ మాట్లాడుతూ.. ''మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు. ఏడో బ్లాక్‌లో సమస్య వల్ల సెంటర్ పియర్ కుంగింది. ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. ఇసుక కారణంగా సమస్య వచ్చిందని భావిస్తున్నాం. బ్యారేజీకి సంబంధించి క్వాలిటీ ఆఫ్ శాండ్, క్వాలిటీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ అనుమతులు ఉన్నాయి. కాపర్ డ్యామ్‌కు వరద తగ్గాక నవంబర్ చివరలో ఘటనపై సమగ్ర పరిశీలన చేస్తాం'' అని ఈఎన్‌సీ పేర్కొన్నారు.










