Oct 19,2023 17:20

ప్రజాశక్తి - చీరాల(బాపట్ల) : ఆయన వైద్యుడు కాదు కాంపౌండర్‌ అని.. జగనన్న ఆరోగ్య సురక్షలో ప్రజలకు ఎలా వైద్య సేవలు అందిస్తారని.. పరీక్షలు చేయించుకునేందుకు క్యాంప్‌కు వచ్చిన వ్యక్తి ప్రశ్నించటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. అంటూ తనపై సోషల్‌ మీడియా వచ్చిన అవాస్తవలపై ఐకాన్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ ఫణి సోషల్‌ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఫణి తన సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం బుధవారం బార్సు హై స్కూల్‌ గ్రౌండ్‌లో అధికారులు నిర్వహించడం జరిగిందన్నారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైద్యలతో పాటు ప్రైవేటు వైద్యలను ఆహ్వానించి ప్రజలకు వైద్య సేవలును అందిస్తున్నారని తెలిపారు. ఆపరేటర్‌ చేసిన పోరపాటుతో ఎముకల వైద్య నిపుణులు డాక్టర్‌ కొండలరావు పేరుకు బదులుగా తన పేరు ప్రింటింగ్‌ తప్పు పడిందని.. తాను అక్కడ ఉన్న అందరిలాగే ఎంబిబిఎస్‌ పూర్తి చేసి.. ఐదు సంవత్సరాలుగా ఐకాన్‌ హాస్పిటల్‌లో వైద్య సేవలు అందిస్తున్నానని తెలిపారు. అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను వీడియోలో బహిర్గతం చేశారు. తాను ఎప్పుడూ ఎముకల వైద్యుడిని అని ఎవరి వద్ద చెప్పలేదన్నారు. జరిగిన పొరపాటును జిల్లా వైద్యశాఖ అధికారులకు తెలియజేశానని.. అసత్య ప్రచారాలు దయచేసి చేయవద్దని కోరారు.