Jul 14,2023 10:39
  • జెనిన్‌ శరణార్థుల శిబిరం సందర్శించిన అనంతరం మీడియాతో పాలస్తీనా అధ్యక్షులు

జెనిన్‌ : వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్‌ శరణార్థుల శిబిరాన్ని పాలస్తీనా అధ్యక్షులు మహమూద్‌ అబ్బాస్‌ గురువారం సందర్శించారు. గతవారంలో ఈ శిబిరంపై ఇజ్రాయిల్‌ సైన్యం వినాశకర దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 12 మంది పాలస్తీనీయులు మరణించగా, వేలాది మంది తమ ఇళ్లను విడిచిపెట్టి నిరాశ్రయులుగా మారాల్సి వచ్చింది. దాదాపు గత 20 ఏళ్లలో వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిల్‌ చేసిన అతి తీవ్ర దాడిగా దీనిని పేర్కొంటున్నారు. ఇజ్రాయిల్‌ తీవ్ర దాడి నేపథ్యంలో జెనిన్‌ శరణార్థుల శిబిరాన్ని పాలస్తీనా అధ్యక్షులు సందర్శించారు. ఈ శిబిరాన్ని పాలస్తీనా అధ్యక్షులు సందర్శించడం 2005 తరువాత ఇదే మొదటిసారి. జోర్డాన్‌ హెలికాఫ్టర్‌లో జెనిన్‌కు అబ్బాస్‌ చేరుకున్నారు. శ్మాశాన వాటికను సందర్శించి, గతవారం దాడిలో మరణించిన వారి సమాధుల వద్ద నివాళిఅర్పించారు. పోరాటం, దృఢత్వం, సవాళ్లకు జెనిన్‌ క్యాంప్‌ ఒక చిహ్నం అని అబ్బాస్‌ తెలిపారు. అలాగే శిబిరం పునర్నిర్మాణంను త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనియన్‌ అథారిటీని బలోపేతం చేయడనికి చర్యలు తీసుకుంటామని ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజిమిన్‌ నెతన్యాహు ప్రకటన తరువాత అబ్బాస్‌ పర్యటన సాగింది. గత ఏడాది నుంచి వెస్ట్‌బ్యాంక్‌పై ఇజ్రాయిల్‌ సైన్యం రోజు వారీ దాడులు ప్రారంభించాయి. కేవలం ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 150 మందికి పైగా పాలస్తీనీయులు ఇజ్రాయిల్‌ సైన్యం దాడుల్లో మరణించారు.