
- పనుల కోసం ఇతర మండలాలకు వలస
- పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణం
- ఉపాధి పనుల కల్పనలో అధికారులు విఫలం
ప్రజాశక్తి - నంద్యాల రూరల్ : నంద్యాల మండలంలోని ఆయా గ్రామాల నుండి రోజుకు వేల సంఖ్యలో ప్రజలు పొరుగు గ్రామాలకు, ఇతర మండలాలకు పనుల కోసం వలస పోతున్నారు. నంద్యాల మండలంలోని బిల్లాలపురం, చాబోలు, అయ్యలూరు, పెద్ద కొట్టలా, కానాల గ్రామాల నుండి తెల్లవారుజామున ఇంటి, వంట పనులు ముగించుకుని సద్ది కట్టుకొని ప్రమాదమని తెలిసినా పొట్ట కూటికోసం తప్పని సరై ఆటోలో పరిమితికి మించి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు చేస్తున్నారు. గతంలో బిల్లాలపురం నుండి కూలి పనుల కోసం పరిమితికి మించి కూలీలతో వెళ్తున్న ఆటో బలపనూర్ మెట్ట వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కూలీలందరూ తీవ్ర గాయాలపాలయ్యారు. మిట్నాల, పాండు రంగాపురం, భీమవరం, పోలూరు గ్రామాలకు మిరప పండు కోత కోసేందుకు పనికి వెళ్తున్నారు.
- ఉపాధి వేతనం సరిపోవడం లేదు
'ఉపాధి పనులకు వెళ్తే రోజుకు రూ. 120 లేదా 150 రూపాయలు మాత్రమే పడుతుంది. ఏ రోజు కూడా 200 రూపాయలు దాటలేదు. అది కూడా మూడు వారాలకు ఒక ఒక్కసారి, నాలుగు వారాలకు ఒకసారి బిల్లులు పడతాయి. అంతవరకు ఇల్లు యెట్లా గడిచేది. అసలే శ్రీరామ నవమి, ఈస్టర్, రంజాన్ పండుగలు ఒకదాని వెంట ఒకటి వస్తుండే. మరి పని చేసుకుంటే తినాలి లేకపోతె ఇబ్బందులు పడాల్సి వస్తుంది.. అందుకే వేరే గ్రామాలకు పనులకు వెళ్తున్నాం. పండు మిరప కోతకు వెళ్తే 300 రూపాయలు ఇస్తారు. అందులో ఆటో చార్జిలు 50 రూపాయలు పోతాయి.. మిగతా 250 రూపాయలు వస్తాయి. ఉపాధి పనులకు తక్కువ వేతనం వస్తుండడం, అదికూడా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉంది. అందుకే ఇతర గ్రామాలకు కూలికి 250 రూపాయల కోసం ప్రమాదకరమని తెలిసినా వెళ్తున్నాం. పనికి వెళ్తేనే పూట గడిచేది. లేకపోతే పస్తుండాల్సిందే..' అనిఅని మహిళా కూలీలు వాపోతున్నారు.
- మస్టర్లలో చేతి వాటం..
కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు వారి కుటుంబ సభ్యులు రాకున్నా తల్లికి, తండ్రికి, చెల్లికి, భార్యకు, వచ్చినోనికి, రానివారికి మస్టర్లు వేసుకుంటారని, దాంతో పనికి వచ్చిన వారు ఎంత పని చేసినా కూలి తక్కువ పడుతుందని కూలీలు చెబుతున్నారు. 'పైన చెకింగ్‌కు వచ్చిన అదికారులేమో పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తారని, కూలి తక్కువ పడుతుందని అడిగితే ఏం చేస్తామమ్మా మీరు పని తక్కువ చేస్తున్నారు.. మీరు కొలతలు సరిగా వేసుకోవడం లేదు.. మీ పనిలో నాణ్యత లేదు' అని సమాధానం చెప్పి వెళ్ళి పోతారు తప్పా తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడంలేదు.. అలా వస్తారు ఇలా వెళ్లి పోతారు..' అని కూలీలు వాపోతునానరు. అందుకే ప్రమాదమో ప్రయాసానో అనుకుంటే పండగ పూట పిల్లలు పస్తులు ఉండాల్సి వస్తుందని అంటున్నారు.
- కూలీల సంఖ్య పెంచడంలో, పనులపై అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం
ఉన్నతాధికారులు ఉపాధి కూలీల సంఖ్య పెంచాలని చెబుతున్న కింది స్థాయి అధికారులు వాటిని గాలికి వదిలేస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులు కూలీల సంఖ్య ఎందుకు పెరగలేదని అడిగితే క్రింది స్థాయి అధికారులు గ్రామాలలో వ్యవసాయ పనులు జరుగుతున్నాయని, అందుకే ఉపాధి పనులకు ప్రజలు సరిగా రావడం లేదని సమాధానం చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉపాధి పనులకు వచ్చేది పది మంది అయితే ఉన్నత అధికారులకు కూలీల సంఖ్య పెరిగిందని చూపడం కోసం కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని గ్రామాలలో ప్రజలు చర్చించుకుకంటున్నారు. ఈ విషయాలు అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు జాబ్ కార్డ్ ఉన్న ప్రజలకు పనులపై అవగాహన కల్పించి, కనీస వేతనం, 250 రూపాయలు వచ్చేలా చేసి, వారం రోజులు చేసిన పనికి వేతనం వచ్చే వారంలోనైనా వచ్చేలా చర్యలు తీసుకోవాలని, ఇతర గ్రామాలకు వలస పోకుండా చూడాలని మహిళా కూలీలు కోరుతున్నారు.