
- కర్నూలు జిల్లాలో మొదలైన వలసలు
- హైదరాబాద్, కర్ణాటకకు పయనం
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి : కర్నూలు జిల్లాల్లో వలసలు మొదలయ్యాయి. ప్రతి ఏడాదీ లాగే ఈ ఏడాది కూడా వర్షాలు పడకపోవడంతో ఇళ్లు, వాకిలి వదిలి.. తట్ట, బుట్టలతో అన్నదాతలు, వ్యవసాయ కూలీలు వలసబాట పట్టారు. ఉన్న ఊరిలో పనులు దొరక్క...పొట్టనింపుకునేందుకు పక్క రాష్ట్రాలకు పయణమయ్యారు. ముసలి వాళ్లను ఇంటి వద్ద వదిలిపెట్టి.. కష్టాన్ని నమ్ముకుని గడపదాటుతున్నారు. తమ వారికి దూరంగా ఉంటూ ప్రతిరోజూ కూలిపనులకు వెళ్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 30 వేల మంది వలసెళ్లిపోయారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఖరీప్ సీజన్‌లో 10.29 లక్షల ఎకరాల్లో పత్తి, మిరప, మొక్కజొన్న, ఉల్లి, వేరుశనగ, కంది, వరి తదితర పంటలను సాగు చేశారు. సరాసరిన ఒక్క ఎకరాకు రూ.50వేల నుంచి రూ. లక్ష ఖర్చు చేశారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో వర్షాలు కురవకపో వడంతో దాదాపు 70 శాతం పంటలు దెబ్బతిన్నాయి. ఈ మూడు నెలల కాలంలో 65 శాతం లోటు వర్ష పాతం ఏర్పడింది. నైరుతి రుతపవనాల నిష్క్రమణతో పంటలపైనా అన్నదాతలు ఆశలు వదులుకున్నారు. చేసిన అప్పులు తీర్చేందుకు ప్రతి ఏడాదిలాగే ఆ ఏడాది కూడా వలసబాట పట్టారు. తెలంగాణలోని రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పత్తి విడిపించేందుకు కోసిగి, ఎమ్మిగనూరు, నందవరం, హోళగుంద, పెద్దకడబూరు మండలాల నుంచి గ్రామాలకు గ్రామాలు తరలిపోయాయి. ఒక్క కోసిగి మండలం లోనే 20 వేల మంది వలస వెళ్లారు. ఎమ్మిగనూరు మండలంలోని కడివెళ్ల, కలగట్ల, సొగనూరు, కంగనాతి, కోటగల్లు, దేవిబెట్ట, దైవందిన్నె, ఏనుగుబాల, పెసలదిన్నె గ్రామాల నుంచి ఇప్పటి వరకూ రెండు వేల మంది వలస వెళ్లారు. నందవరం మండల వ్యాప్తంగా 80 శాతం లోటు వర్షపాతం వల్ల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో కనకవీడు, నందవరం, మాచాపురం, పులిచింత, పొనకలదిన్నె, సామలగూడూరు, మిట్టసోమాపురం గ్రామాల నుంచి ఇప్పటి వరకూ నాలుగు వేల మంది గుంటూరులో మిరప పనులకు, తెలంగాణలోని శాంతి నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో పత్తి విడిపిం చేందుకు వెళ్లారు. హోళగుంద మండలంలోని గజ హళ్లి, వందవాగలి, నెరణికి, హోళగుంద, హెబ్బటం గ్రామాల నుంచి వెయ్యి మంది బెంగళూరు, హైద్రాబాద్‌కు వలస వెళ్లారు. పెద్ద కడబూరు మండలంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రతి ఏడాదీ వలసలు కొనసాగుతున్నా వాటి నివారణకు అధికారులు శాశ్వత చర్యలు చేపట్టక పోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వర్షాలు కురవక పనుల్లేవు
ఈ ఏడాది వర్షాలు కురవకపోవడం వల్ల పంటలు ఎండిపోయాయి. పనులు లేవు. దీంతో కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు వలస వెళ్లాము. ఊర్లో ఉంటే రోజు తిండి దొరకదు చేసిన అప్పులు కూడా తీరవు. పిల్ల పాపలతో వలస వచ్చాము. ఇక్కడ ఆడవారికి రూ.400 మగవారికి రూ.600 కూలీ ఇస్తున్నారు. ప్లాస్టిక్ కవర్‌తో చిన్నగా గుడిసెలు వేసుకుని జీవనం చేస్తున్నాము. తాగడానికి రూ.10 పెట్టి ఫిల్టర్ నీళ్లు తెచ్చుకుంటాము. స్నానం చేయడానికి వారానికోసారి మమ్మల్ని కూలి పనికి పెట్టుకున్న వాళ్ల ఇళ్లలో నీరు తెచ్చుకుని స్నానం చేస్తామ. మా బాధను ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు. - నారాయణప్ప, గజ్జహల్లి, హొళగుంద మండలం.

కుటుంబం మొత్తం వలస
తీవ్ర వర్షాభావంతో పంటలు దక్కకపోవడంతో కర్ణాటక రాష్ట్రం చేగుంటకు వలస వెళ్తున్నాము. అక్కడ అయితే పత్తి తీసే పనులు ఉంటాయి. కిలోకు రూ.10 కూలీ ఇస్తారు. బతకడం కోసం కుటుంబం మొత్తం వలస వెళ్తున్నాము. ఊర్లో ఉపాధి పనులు చేసినా సరైన సమయానికి బిల్లులు అందడం లేదు. - ఈరన్న, దుద్ది, కోసిగి మండలం.