
ప్రజాశక్తి- బాడంగి (విజయనగరం జిల్లా) : బతుకు తెరువు కోసం తమిళ నాడు వలస వెళ్లిన విజయనగరానికి చెందిన ముగ్గురు కార్మికులు అక్కడ జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... విజయనగరం జిల్లా బాడంగి మండలం వీరసాగరం గ్రామానికి చెందిన నక్కేల సత్యం (38), రాపాక కన్నయ్య (56), కొల్లి జగన్నాథం (53) తమ కుటుంబాలతో సహా ఉపాధి కోసం ఆరేళ్ల క్రితం తమిళనాడుతోని కోయంబత్తూరుకు వలస వెళ్లారు. ఏటా సంక్రాంతి పండగకు స్వగ్రామం వచ్చి కొద్ది రోజలు ఉండి మళ్లీ వెళ్తుండేవారు. మంగళవారం ఉదయం తమ భార్యలతోసహా ప్రహరీ నిర్మాణ పనులకు వెళ్లారు. సాయంత్రం పని పూర్తయిన తరువాత మహిళలు ఇళ్లకు వెళ్లిపోగా వీరు ముగ్గురూ అదనపు పని చేసేందుకు ఉండిపోయారు. ఈ నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న ప్రహరీ కూలిపోవడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. సత్యానికి ఇద్దరు కుమారులు, కన్నయ్యకు ముగ్గురు పిల్లలు, జగన్నాథానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.