
- రూ.మూడు లక్షల కోట్లు కేటాయిస్తేనే న్యాయం
- భూ పంపిణీతోనే వ్యవసాయ కార్మికుల అభివృద్ధి
- వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ నాయకులు, ఎంపి శివదాసన్
- ఉపాధి చట్టంపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి : వి. శ్రీనివాసరావు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి:ఉపాధి హామీకి ప్రతియేటా మోడీ సర్కార్ నిధుల కోత విధిస్తూ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు పూనుకుందని, దీన్ని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని, ప్రతియేటా బడ్జెట్‌లో ఉపాధి హామీకి రూ.మూడు లక్షల కోట్లు కేటాయించాలని వ్యవసాయ కార్మికసంఘం జాతీయ నాయకులు, ఎంపి శివదాసన్ అన్నారు. ఉపాధి హామీ పనిదినాలు, వేతనాల పెంపుతో పాటు పట్టణాలకు ఈ చట్టాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరులోని కాశీవిశ్వేశ్వరయ్య కల్యాణ మండపంలో బుధవారం సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అధ్యక్షతన రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన శివదాసన్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలోని పేదలకు పని కల్పించేందుకు వామపక్షాల మద్దతుతో యుపిఎ ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందన్నారు. మోడీ పాలనలో ఈ చట్టానికి నిధుల్లో కోత విధిస్తోందని తెలిపారు. గడిచిన బడ్జెట్లో రూ.28 వేల కోట్లు కోత విధించారని, దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని కోరారు. కేరళలో ఉపాధి కూలీలకు రూ.332 కూలి ఇస్తుంటే ఎపి, తెలంగాణలో రూ.272 ఇస్తున్నారని తెలిపారు. ఒకే సివిల్ కోడ్, వన్ ఆధార్, వన్ రేషన్, ఒకే భాష అంటున్న మోడీ సర్కార్ దేశమంతా ఒకే కూలి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఉపాధి పనికి 30 రోజులు వెళ్లినా రూ.ఏడు వేలు కూడా రావడం లేదన్నారు. పిల్లల చదువులకు ఏడాదికి రూ.లక్షల్లో ఖర్చవుతుందని, అటువంటప్పుడు వ్యవసాయ కార్మికులు తమ పిల్లలను ఏ విధంగా చదివించుకోగలరని ప్రశ్నించారు. 1957లోనే కేరళలో నంబూద్రిపాద్ ప్రభుత్వం భూ పంపిణీ చేపట్టిందన్నారు. భూమి ఉంటేనే పేదలు అభివృద్ధి చెందుతారని, బిజెపి ఆ విధంగా చేయడం లేదని అన్నారు. భూమి కోసం ఇళ్లస్థలాల కోసం వ్యవసాయ కార్మికులు పోరాటం చేయాలన్నారు. దేశవ్యాప్తంగా రూ.20 కోట్ల మందికి జాబ్‌కార్డులున్నాయని, వీరి పిల్లలకు విద్య, వైద్యం అందుబాటులో లేదని, వ్యవసాయ కార్మికులకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. జగన్ జైలుకు వెళ్లచ్చారని, చంద్రబాబు జైల్లో ఉన్నారని, ఇక్కడ ప్రజాధనం లూఠీ జరుగుతుందని అన్నారు. వ్యవసాయ కార్మికులకు పెన్షన్ ఇవ్వడం లేదని, కేరళ బడ్జెట్‌లోనే వ్యవసాయ కార్మికుల పెన్షన్లకు నిధులు కేటాయించారన్నారు. భవిష్యత్తులో ఆశాజనకమైన రోజులు రాబోతున్నాయని, అంతా కలిసికట్టుగా పోరాటం చేయాలని కోరారు. బడ్జెట్‌లో ఉపాధి హామీకి రూ.మూడు లక్షల కోట్లు కేటాయించాలని, ఏడాదికి ఒక కుటుంబానికి 200 పనిదినాలు, రూ.600 వేతనం ఇవ్వాలని, పట్టణ ప్రాంతాల్లో ఈ చట్టాన్ని అమలు చేయాలంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు తీర్మానం ప్రవేశపెట్టగా దాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం బలపరిచారు. ఈ తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది.
- ఉపాధిపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి : శ్రీనివాసరావు
త్వరలో ఎన్నికలు జరగనున్నాయని, అయితే ప్రజా సమస్యలపై కాకుండా ఇతర విషయాలపై చర్చలు జరుగుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. 2006లో ఉపాధి చట్టాన్ని సాధించుకున్నామని, ఈ చట్టం ప్రకారం పనిచేసే హక్కు అందరికీ ఇవ్వాలన్నారు. తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వ సంస్థలను అమ్మేసిన పరిస్థితి ఉందని, అదేవిధంగా ఉపాధి చట్టంపై దుష్ప్రచారం జరుగుతుందని తెలిపారు. ఈ చట్టం దెబ్బతింటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందన్నారు. ఈ చట్టాన్ని ఎవ్వరూ మార్చకుండా షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలూ మద్దతివ్వాలన్నారు. ఎన్నికల్లో ఇదే ఎజెండాగా కొనసాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు, వి.శివనాగరాణి, సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య, న్యూడెమోక్రసీ నాయకులు పోరండ్ల శ్రీనివాస్, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.కిషోర్, డిఎన్‌విడి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.