- దాడిని ఖండించిన పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రెస్ క్లబ్..
ప్రజాశక్తి - పల్నాడు : తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడంతో కక్ష పూరితంగా స్వతంత్ర ఆన్ లైన్ పోర్టల్ న్యూస్ క్లిక్‌పై మోడీ సర్కారు ఉక్కు పాదం మోపడాన్ని ఖండిస్తూ నరసరావుపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు.కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ ఎం.శేషిరెడ్డికి వినతిపత్రం అందజేసిన అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజాశక్తి రిపోర్టర్ పచ్చవ బుజ్జిబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సిహెచ్ రమణారెడ్డి మాట్లాడుతూ న్యూస్ క్లిక్ పై బిజెపి ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ఉపా చట్టం కింద నేరపూరిత కుట్రలకు పాల్పడుతూ పలు కేసులు పెట్టడం గర్హనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఇష్టం లేని వార్తలు ప్రసారం చేస్తున్నందునే ప్రముఖ పాత్రికేయుడు, రచయిత ప్రబీర్ పుర్కాయస్థ నేతత్వంలో నడుస్తున్న పోర్టల్‌పై ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆఫ్ ఫెడరేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షులు టివి9 రిపోర్టర్ బి.ఎన్‌ప్రసాద్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానాలు, మీడియాపై దాడులు, వేధింపులు వల్ల ఇప్పటికే దేశంలో ప్రపంచ పత్రికా స్వాతంత్య్రంలో అట్టడుగు స్థాయికి చేరిందని గుర్తు చేశారు. న్యూస్ క్లిప్‌పై దాడిని దేశంలో మీడియా స్వేచ్ఛపైనా మరియు ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు నంద్యాల జగన్మోహన్ రెడ్డి (వార్త) మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో పత్రిక స్వేచ్ఛను హరిస్తూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు హేయమన్నారు. స్వతంత్ర వార్తా పోర్టల్ 'న్యూస్ క్లిక్' పై కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం, పీడీ చట్టం విధించి ఎడిటర్ పై వారి సిబ్బందిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని అరెస్ట్ చేసిన ఎడిటర్ ను జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.మీడియాపై దాడులను సహించేది లేదని హెచ్చరించారు. మీడియా స్వేచ్ఛపై దాడి సిగ్గు సిగ్గు, మోడీ నిరంకుశత్వం నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు సూరే లక్ష్మయ్య, నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు బండి శివ (సూర్య), పల్నాడు జిల్లా ప్రెస్ క్లబ్ నరసరావుపేట జాయింట్ సెక్రెటరీ నందిగం సుధీర్ బాబు (ప్రజా పాలన), లీలా మీడియా ప్రతినిధి గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రజాశక్తి పల్నాడు ఇంచార్జ్ లు ఎన్. కష్ణ, జి.ప్రేమ సాగర్, వార్త రిపోర్టర్లు సాంబశివరావు, శ్రీనివాస్, క్యాపిటల్ వాయిస్ జిల్లా స్టాఫర్ ఆలీ, ప్రోగ్రెస్ యు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి శ్రీనివాస్ (యథార్థం) జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధి కె. రమేష్ (మీడియా మిత్ర) పలువురు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు.