Aug 06,2023 15:00

ప్రజాశక్తి - పల్నాడు : ప్రజా స్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు చాలా కీలకమని పల్నాడు కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి పేర్కొన్నారు. ఓటర్ల జాబితాను సన్నద్ధం చేయడంలో ఎక్కడా ఆరోపణలు, అవకతవకలకు తావులేకుండా అధికారులు పని చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని రాజకీయ పార్టీల వినతులను పరిగణలోకి తీసుకొని ఓటర్ల జాబితాను సన్నద్ధం చేయాలన్నారు. పల్నాడు జిల్లాలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆధ్వర్యంలో కలెక్టర్‌ అధ్యక్షతన స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ -2024 సంక్షిప్త ఓటర్ల జాబితా సర్వే ప్రక్రియకు సంబంధించి జిల్లా కలెక్టరేట్‌లోని ఎస్‌ ఆర్‌ శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఆదివారం ఈఆర్‌ ఓ లు, ఏఈఆర్‌ఓలతో సమీక్షా సమావేశం జరిగింది. సంక్షిప్త ఓటర్ల జాబితా సర్వే జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్‌ అడిగి తెలుసు కున్నారు. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను జిల్లా అధికారులను అడిగి తెలుసుకొని, అందుకు తగిన విధంగా తీసుకోవల్సిన చర్యలపై దిశా,నిర్దేశనం చేశారు. 28 మండలాలు, 7 నియోజక వర్గాలలలో ఎన్నికల నిర్వహణ అధికారులు గా కొనసాగుతున్న వారు నిష్పక్త పాతంగా సర్వే ప్రక్రియ త్వరగా పూర్తిచేసి నివేదికను కలెక్టరేట్‌కు పంపాలని ఆదేశించారు. సర్వే జరుగుతున్న క్రమంలో రాజకీయ పార్టీలకు చెందిన పోలింగ్‌ బూత్‌ లెవల్‌ ఎజెంట్ల సమక్షంలో వచ్చే ఇబ్బందులను అధిగమించాలని సూచించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, చని పోయిన వారి పేర్లను తొలగించడం, కొత్త ఓటర్లను చేర్చడంలో ఎక్కడా ఆరోపణలు రావడానికి వీలు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, జిల్లాకు చెందిన ఈ.ఆర్‌.ఓ లు, ఏ. ఏ.ఈ.ఆర్‌.ఓ లు, తదితరులు పాల్గన్నారు.