Mar 28,2023 10:20
  • రాష్ట్ర ప్రభుత్వానికి అందిన ముసాయిదా ప్రణాళిక

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న 2023-24 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక రుణ ప్రణాళికను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. మొత్తం రూ.3,80,000 కోట్లతో ఈ ప్రణాళిక సిద్ధం చేసింది. దాదాపుగా ప్రభుత్వం కూడా ఇదే ప్రణాళికను ఆమోదించే అవకాశాలున్నాయి. ఈ ప్రణాళికలో ఎప్పటిమాదిరిగానే ప్రణాళికా రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా రుణ కేటాయింపులు చేయనున్నారు. త్వరలోనే జరగనున్న సమావేశంలో దీనిని ఆమోదించనున్నారు.
       గతేడాది వార్షిక రుణ ప్రణాళిక కిరద రూ.3,19,480 కోట్లు కేటాయింపులు జరగ్గా, ఈ ఏడాది వార్షిక రుణ ప్రణాళికలో రూ.3,80,000 కోట్లు కేటాయింపులు ఉంటాయి. ఇందులో భాగంగా వ్యవసాయ రంగానికి రూ.1,85,000 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఇందులో స్వల్పకాల ఉత్పత్తి రుణాల కిరద రూ.1,26,500 కోట్లు కేటాయించనున్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.3 వేల కోట్లు, డెయిరీకి రూ.9 వేల కోట్లు, కోళ్ల పరిశ్రమకు రూ.1,200 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాల రుణాలకు రూ.29,800 కోట్లు కేటాయించనున్నారు. వ్యవసాయ టర్మ్‌ రుణాల కింద రూ.46,500 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.63 వేల కోట్లు కేటాయింపులు ఉండనున్నాయి. గతేడాది కన్నా ఈ కేటాయింపులు 26 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఇతర ప్రాధాన్యతా రంగానికి రూ.23,000 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఇందులో ఎగుమతుల కోసం రూ.1500 కోట్లు, విద్యకు రూ.2,000 కోట్లు, ఇళ్ల నిర్మాణానికి రూ.12,200 కోట్లు, సామాజిక సౌకర్యాల కోసం రూ.500 కోట్లు, సాంప్రదాయేతర విద్యుత్‌ కోసం రూ.400 కోట్లు కేటాయింపులు ఉండనున్నాయి. ఇవి కాకుండా ప్రాధాన్యేతర రంగానికి రూ.1,09,000 కోట్లు కేటాయింపులు ఉంటాయి. ఇందులో వ్యవసాయానికి రూ.3,000 కోట్లు, విద్యకు రూ.800 కోట్లు, ఇళ్ల నిర్మాణానికి రూ.15 వేల కోట్లు, వ్యక్తిగత రుణాలకు రూ.22 వేల కోట్లు ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.68,200 కోట్లు కేటాయింపులు ఉంటాయి.