ఢిల్లీ : పార్లమెంటులో ఇటీవల ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. వచ్చే ఏడాదిలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందే వీటిని అమలు చేయాలని పిటిషన్‌లో కోరారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లును 'నారీ శక్తి వందన్ అధినియమ్' పేరుతో ప్రవేశపెట్టిన బిల్లుకు సెప్టెంబర్ నెలలో పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలిపాయి. రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఆ బిల్లు చట్టరూపం దాల్చింది. అయినప్పటికీ ఈ చట్టం ప్రస్తుతం అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. జనగణన, డీలిమిటేషన్ తర్వాత ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ లోక్‌సభకు తెలిపారు. ఇలా ఈ చట్టం అమలు ఆలస్యమవుతుండటంపై కాంగ్రెస్ నేత డాక్టర్ జయ ఠాకూర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. చట్టం అమలుకు ఉన్న అడ్డంకులను చెల్లనివిగా ప్రకటించి తక్షణమే ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.










