ఆర్థిక సలహా కౌన్సిల్ సభ్యుడి వెల్లడి
న్యూయార్క్ : అదాని గ్రూపు సంక్షోభంపై పిఎం మోడి, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా కౌన్సిల్ సభ్యులు సంజీవ్ సన్యాల్ తెలిపారు. అదాని గ్రూపు తీవ్ర ఆర్థిక అవకతవకలు, మోసాలకు పాల్పడుతున్నాయని అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఇచ్చిన రిపోర్ట్‌తో అదాని కంపెనీలు భారీ నష్టాలు చవి చూసిన విషయం తెలిసిందే. న్యూయార్క్‌లో ఓ ఇంటర్యూలో సన్యాల్ మాట్లాడుతూ.. అదాని అంశంలో ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోలేదన్నారు. భారత విధానంలో ఎవరూ ఎవరినీ రక్షించాల్సిన అవసరం లేదన్నారు.
''దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ ఎస్‌బిఐ, అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసి నుండి అదాని గ్రూపునకు తక్కువ రుణాలే అందాయి. ఏ కంపెనీ కూడా ఎలాంటి ఆర్థిక ఒత్తిడికి గురికాలేదు. '' అని సన్యాల్ పేర్కొన్నారు. అదాని గ్రూపు మోసాలపై జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కీలక రిపోర్టును వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ రిపోర్ట్ దెబ్బకు అదాని కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ 60 శాతం వరకు పతనమయ్యింది. దాదాపు రూ.8 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరయ్యింది. అనేక మంది రిటైల్ ఇన్వెస్టర్లు భారీ నష్టాలు చవి చూశారు. అదానికి అప్పులిచ్చిన బ్యాంక్‌ల షేర్లు అమాంతం పడిపోయాయి. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న అదాని ఓ దశలో 30వ స్థానానికి దిగజారారు.
''మార్కెట్లు పారదర్శకంగా పని చేసేలా వాటి పనితీరును నిర్ధారించుకోవడం మా పని, మేము జోక్యం చేసుకోవడం కోసం కాదు. పారదర్శకత, క్రమబద్ధంగా పని చేసేలా మాత్రమే మేము శ్రద్ధ వహిస్తాము. ఈ ప్రక్రియలో ధరలు కొన్నిసార్లు పెరుగుతాయి, కొన్నిసార్లు అవి తగ్గుతాయి.'' అని సన్యాల్ పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం భారత స్టార్టప్‌లపై ఎలాంటి ప్రభావం చూపబోదని అన్నారు.










