- నేడు చార్మినార్, ఉప్పల్‌లో ప్రదర్శన!
హైదరాబాద్: ఐసిసి వన్డే ప్రపంచకప్ ట్రోఫీ బుధవారం హైదరాబాద్ చేరుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ కప్పును ప్రదర్శించారు. గురువారం చార్మినార్, ఉప్పల్ క్రికెట్ మైదానంలో ప్రపంచకప్‌ను ప్రదర్శించనున్నారు. ప్రపంచకప్ విజేతలకు అందించే ఈ ట్రోఫీకి ఘన చరిత్ర ఉంది. 1999 ప్రపంచకప్ నుంచి ఇప్పుడున్న ట్రోఫినే విజేతలకు అందజేస్తున్నారు. ఛాంపియన్ జట్టుకు మొదట ఈ ట్రోఫీని ప్రదానం చేసి.. అనంతరం దీని నమూనాను ఇస్తున్నారు. నిజమైన ట్రోఫీ కింది భాగంలో విజేత జట్ల పేర్లను రాస్తున్నారు. ప్రస్తుత ట్రోఫీని లండన్‌లోని గరార్డ్ అండ్ కో అనే ఆభరణాల సంస్థ తయారుచేసింది. దీని తయారీలో బంగారం, వెండి ఉపయోగించారు. ఇది 60 సెంటీమీటర్ల ఎత్తుతో పాటు 11 కిలోల బరువు ఉంటుంది. ఏ కోణం నుంచి చూసినా ఒకేలా కనిపించడం దీని ప్రత్యేకత. మూడు వైపులా పొడుగ్గా ఉండే వెండి స్టంప్స్, బెయిల్స్ మీద బంగారు గ్లోబ్ రూపంలో బంతి పొదిగి ఉన్నట్లు ఉంటుంది. క్రికెట్లోని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లను ఈ మూడు స్టంప్స్ ప్రతిబింబిస్తాయి.ఇక 1999 ప్రపంచకప్ ముందు నాలుగు రకాల ట్రోఫీలను మార్చారు. ఇంగ్లండ్‌లో జరిగిన తొలి మూడు (1975, 1979, 1983) ప్రపంచకప్‌ల్లోనూ ఒకే రకమైన ట్రోఫీని అందజేశారు. స్పాన్సర్‌షిప్ కారణంగా ప్రుడెన్షియల్ కప్‌గా వ్యవహరించిన ఇది చూడ్డానికి వింబుల్డన్ పురుషుల ట్రోఫీలాగా ఉండేది. తొలిసారి ఇంగ్లండ్ బయట 1987లో ప్రపంచకప్ నిర్వహించారు.










