Oct 30,2023 13:46

ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి : రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించి దేశాన్ని రక్షించుకోవాలని, వామపక్షాలే ఏకైక ప్రత్యామ్నాయం అని వామపక్షాలను బలపరచాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు అశోక్‌ ధావలే పిలుపునిచ్చారు. సిపిఎం చేపట్టిన ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర కర్నూలు జిల్లా ఆదోని నుండి సోమవారం ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశోక్‌ ధావలే హాజరై మాట్లాడారు. వామపక్ష శక్తులను బలపరచాలన్నారు. అన్ని ప్రాంతాలలో సమానత కావాలని రాష్ట్ర వ్యాప్తంగా మూడు బస్సు యాత్రలు సాగుతున్నాయని తెలిపారు. ప్రజా సమస్యల మీద ఈ యాత్ర దఅషి సారించనుందని అన్నారు. కర్నూలు జిల్లాలో ప్రధాన పంట అయిన పత్తి గతంలో ఎకరాకు 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదని, ఇప్పుడు ఒకటి, ఒకటిన్నర క్వింటా మాత్రమే వస్తోందని, అలాంటి దుర్భర పరిస్థితిని రాష్ట్రంలో రైతులు ఎదుర్కుంటున్నారని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం కరువు నివారణ చర్యలు చేపట్టకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. అత్యధిక ప్రాంతాల్లో పండే వరికి క్వింటాకు కేంద్రం రూ.2100 మాత్రమే మద్దతు ధర ప్రకటించిందని, కేరళలోని వామపక్ష ప్రభుత్వం రూ.2850 ఇస్తోందని తెలిపారు. వామపక్షాలే ఏకైక ప్రత్యామ్నాయం అన్నారు. రాష్ట్రంలోని 679 మండలాల్లో 400కు పైగా మండలాల్లో కరువు ఉందని, వైసిపి ప్రభుత్వం ఇప్పటి వరకూ కరువు మండలాలు ప్రకటించలేదని, దానివల్ల రైతులు, మహిళలు, యువత ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని అశోక్‌ ధావలే డిమాండ్‌ చేశారు. సాగునీటి ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం లేదని, కేంద్రం కూడా సాయం చేయడం లేదని అన్నారు. ప్రాజెక్టులు లేకుండా సాగు ఎలా చేస్తారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఎక్కడా స్మార్ట్‌ మీటర్లు పెట్టకూడదని, పెడితే ధ్వంసం చేయాలని సిపిఎఎం కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరుద్యోగానికి ప్రత్యామ్నాయం లేదని అన్నారు. విద్యను ప్రయివేటీకరణ చేయడానికి కేంద్రం నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చిందనీ, చరిత్రను వక్రీకరించి ఆర్‌ ఎస్‌ఎస్‌ పాఠాలు చేరుస్తున్నారనీ, విద్యను కాషాయీకరణ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ల అనుకూలమని, మతోన్మాదంతో కూడుకున్నదని అన్నారు. తొమ్మిదేళ్లుగా మహిళలు, యువత, రైతులు, కార్మికులు, అన్ని వర్గాలు అణగదొక్కబడుతున్నారన్నారు. ఢిల్లీ రైతు పోరాటం ఒక చారిత్రక పోరాటమన్నారు. నాలుగు లేబర్‌ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు సంకెళ్లు వేస్తున్నారని, ప్రజలు వాటిని వ్యతిరేకించకుండా కులాలు, మతాల పేరుతో విశేషాలను రెచ్చగొట్టి చీలికలు తెస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు బిజెపికి వత్తాసు పలుకుతున్నాయన్నారు. బిజెపితో కలిసి వెళ్లే ఏ పార్టీతో సిపిఎం కలిసి వెళ్ళదని అశోక్‌ ధావలే స్పష్టం చేశారు.