Oct 24,2022 08:27

భారతీయ అభ్యుదయ రచయితల సంఘం లండన్‌లో 1935లో మొదలైంది. దీనికి ప్రారంభ చర్చలు జరిగిన ప్రదేశం ఒక హౌటల్‌. డెన్మార్క్‌ స్ట్రీట్‌లోని నాన్‌ కింగ్‌ రెస్టారెంట్‌, ఇది బ్లూమ్స్‌ బరీకి, సోహౌకీ దగ్గరగా ఉండేది. సయ్యద్‌ సజ్జద్‌ జహీర్‌, జ్యోతిర్మోరు ఘోష్‌ ముల్క్‌ రాజ్‌ ఆనంద్‌, మహమ్మద్‌ దీన్‌ తాసిర్‌, ప్రమోదే సేన్‌ గుప్తా, బ్రిటిష్‌ రచయిత రాల్ఫ్‌ ఫాక్స్‌, మరి కొందరు ఈ హౌటల్‌ సెల్లార్‌లో కలుసుకోవడానికి, భారతీయ స్వాతంత్య్రో ద్యమం పట్ల సానుభూతి గల ఆ హౌటల్‌ యజమాని అయిన చీనీయుడు వెసులుబాటు కలిగించాడు.
          ఈ మానిఫెస్టోతో తెలుగు సాహిత్యానికి, విశాఖపట్నానికి దగ్గర సంబంధం ఉంది. అది అబ్బూరి రామకృష్ణారావు, శ్రీశ్రీల ద్వారా సాధ్యమైంది. ఈ మానిఫెస్టో ఒక రహస్య ప్రతిని తెచ్చి అబ్బూరి రామకృష్ణారావు, యువకుడైన శ్రీశ్రీకి ఇవ్వగా, తాను అది చదివి, ప్రతిజ్ఞ అనే ప్రఖ్యాత గీతాన్ని రాశాడు. 'పొలాలనన్నీ హలాల దున్నీ' అంటూ సాగే ఈ గీతం అటు కర్షకులు, ఇటు కార్మికులు ఇరు వర్గాల శ్రమను ఉన్నతీకరించి, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైంది లేనే లేదని చాటి చెప్పింది. అరుణోదయ, జననాట్య మండలి కళాకారులు అపురూపంగా రంగస్థలిపై ప్రదర్శించిన, జన బాహుళ్యంలో విస్తృత ఆదరణ కలిగి వున్న ఒక విజయవంతమైన కళారూపం. సామ్యవాద సౌందర్యానికి ఒక సాంస్క ృతిక రాయబారిగా తెలుగు సాహిత్యంలో నిలిచిపోయిన ఈ గీతపు నేపథ్యంలో, బలమైన ప్రేరణగా లండన్‌ భారతీయ అభ్యుదయ రచయితల మానిఫెస్టో వుండడం మనకు గర్వకారణం.
అభ్యుదయ రచయితల సంఘం, లండన్‌ మానిఫెస్టో (1936)
 

ఆ మానిఫెస్టో తెలుగు రూపం ఇదీ :
''భారతీయ సమాజంలో తీవ్రతరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిని నిరోధించే శక్తులు చిట్ట చివరికి కాలం చెల్లినవీ, క్షీణించి పోవాల్సినవే అయినా ఇంకా సమాజంలో పనిచేస్తూ, తమ ఆయుష్షు పెంచుకునే పనిలో ఉన్నాయి. భారతీయ సాహిత్యంలో ప్రాచీన సంస్క ృతికి ఆటంకాలు ఏర్పడ్డ కాలం నుంచే జీవిత వాస్తవాల నుంచి తప్పించుకుపోయే ఒక ప్రాణాంతకమైన ధోరణి అలవడింది. భారతీయ సాహిత్యం వాస్తవిక ఇబ్బందుల నుంచి, మొగం చాటు చేసుకుని ఏ పునాదులూ లేని వేదాంతం, ఆదర్శ వాదాలలో తనకో చోటు వెదుక్కుంటున్నది. ఫలితమల్లా ఏమైందంటే, శారీరికంగా అది రక్త హీనమైంది. బుద్ధి, పెళుసు బారిన దృష్టినీ, విపరీత సిద్ధాంతాలనూ తోడు తెచ్చుకున్నది.

ఇవాళ భారతీయ రచయితల కర్తవ్యం ఏమిటంటే, సంఘంలో చోటు చేసుకుంటున్న మార్పులను తమ రచనల్లో చిత్రించడం, ప్రగతిశీల శక్తుల తత్వానికి తోడ్పాటు అందిస్తూ సమాజంలో శాస్త్రీయ తార్కిక దృష్టిని ప్రవేశపెట్టడం. సమాజంలో వేళ్ళు తన్నుకుని వుండి, కుటుంబం, మతం, లైంగికత, యుద్ధం, సమాజం వంటి వాటి పట్ల ప్రగతి నిరోధక చింతనతో, గత పునరుద్ధరణ కోసం ఆరాటపడే ఆలోచనలను ఎదుర్కొనే, సాహిత్య విమర్శ దృక్కోణాన్ని వారు అభివృద్ధి చేయాలి. మత తత్వాన్ని, సామాజిక వర్గాల మధ్య, అశాంతి, ద్వేషాలను, మనిషిని మనిషి దోచుకునే ఆధిపత్యాలను సమర్ధిస్తూ, రెచ్చగొట్టే, రచనలతో వారు సంఘర్షించాలి.
      మా సంఘం ఆశయం ఏమిటంటే.. మితవాద, ఛాందసవాద వర్గాల చేతుల్లో ఇన్నాళ్లూ క్షీణిస్తూ వున్న సాహిత్యాన్ని, ఇతర కళలను, ప్రజలపరం చేసి, వాటి ద్వారా జీవితపు వాస్తవికతలను నమోదు చేయడంతో బాటుగా మనం దర్శిస్తున్న భవిత దిశగా ఆ రచనల మార్గ దర్శకత్వంలో ముందుకు పోవడం. భారతదేశపు ఉత్తమ సాంప్రదాయా లకు మేము వారసులమని పేర్కొంటూనే ప్రగతి నిరోధకశక్తుల స్వభావాన్ని, ఆన్ని పార్శ్వాల్లోనూ విమర్శిస్తూ, కొత్త వ్యాఖ్యానాలు (దేశ, విదేశ) ఇచ్చే బలంతో సృజనాత్మక సంపన్నతతో, ఇవాళ దేశం కోరుకుంటున్న నవ్య జీవనాన్ని సాధించేందుకు కృషి చేస్తాము. ఇవాళ భారతదేశపు కొత్త సాహిత్యం మౌలిక సమస్యలైన ఆకలి, పేదరికం, సామాజిక వెనుకబాటుతనం, రాజకీయ ఆధిపత్య ధోరణులు... వీటన్నిటి పట్ల వ్యతిరేకత బలమైన అంశంగా కలిగి వుండాలి. ఏవైతే మనలను నిర్వ్యాపరత, సోమరితనం, మౌఢ్యం వేపుగా తోస్తాయో అవన్నిటినీ, మేము ప్రగతి నిరోధకంగా తిరస్కరిస్తున్నాము.
    మనలో విమర్శనాత్మక చింతనను పెంపొందించే వ్యవస్థలూ, ఆచారాలూ, అలవాట్లూ గురించి తర్కబుద్ధితో ఆలోచించేలాగా, మనం సమీకృతమయ్యేలాగా, మార్పును స్వాగతించేవిగా వున్నవన్నీ మనం ప్రగతికి అనుకూలమైన వాటిగా ఆమోదిస్తాము.
 

మా సంఘం ఆశయాలు ఇవీ ...:
అనేక భాషాప్రాంతాలకు చెందిన రచయితలకు ప్రాతినిధ్యం వుండేలా సంఘాన్ని నిర్మాణం చేయడం. ఈ సంఘాలన్నిటినీ సభలు, సమావేశాలు, పుస్తక ప్రచురణల ద్వారా ఒక సమన్వయం దిశగా నడపడం. మా కేంద్ర సంఘం ఆశయాలతో విబేధం లేని విధంగా వున్న ఇతర సాహిత్య సంఘాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడం. దేశంలోని ముఖ్యమైన పట్టణాల్లో సంఘం శాఖలను స్థాపించడం.
అభ్యుదయ స్వభావం గల రచనల సృజన, అనువాదాల ద్వారా ప్రగతి నిరోధక శక్తులను ఎదుర్కోవడమూ, తద్వారా, భారత దేశ స్వాతంత్య్ర సముపార్జన, సామాజిక పునరుజ్జీవనం సత్వరమే సాధించే దిశగా ముందుకు సాగడం. ప్రగతిశీల రచయితల ప్రయోజనాల పరిరక్షణ చేయడం. స్వేచ్ఛగా ఆలోచనలు చేసి అభిప్రాయాలు చెప్పే హక్కు కై పోరాడడం.
అభ్యుదయ రచయితల సంఘం ఆనాడు స్వతంత్ర పూర్వ భారత దేశంలో కుల మతాల తేడా లేకుండా, అటు పంజాబ్‌ నుంచి ఇటు కేరళ దాకా రచయితలను కదిలించి ప్రగతిశీల భావజాలం గల వామపక్ష సృజన కారులుగా నిలిపింది. అంతేకాక, ఆనాటి భారతీయ సాంఘిక, రాజకీయ రంగాల్లో ముఖ్యులైన ఎందరో యువ నాయకులు, ఈ భారతీయ ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ సంఘాన్ని సమర్ధించి అండగా నిలబడ్డారు. దీనికి కారణాలు, వలస పాలకుల సామ్రాజ్య వాదం, పెట్టుబడిదారీ లాభాలు కొల్లగొట్టే పద్ధతులు, యుద్ధోన్మాదం, ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కాలంలో, ప్రపంచ వ్యాప్తంగా ప్రగతిశీల శక్తుల నిరసనల ఐక్య స్వరాలు వినిపించాయి.
సంఘంగా ఏర్పడుతున్న కాలంలోనే, లండన్‌లోని నాంకింగ్‌ చైనీస్‌ హౌటల్‌లోని సెల్లార్‌లో వీరిని ఉద్దేశించి ప్రసంగించిన వారిలో డా.సునీతి కుమార్‌ చటర్జి ఉన్నారు. లక్నో వచ్చాక రఘుపతి సహాయి, ఫిరాక్‌ గొరఖ్‌ పురి, అహ్మద్‌ ఆలి, భిశంబర్‌నాథ్‌ పాండే, శ్యామ్‌ కుమారి, జవహర్‌ లాల్‌ నెహ్రూలతో సజ్జద్‌ జహీర్‌ ఈ విషయాన్ని సంప్రదించాడు. 1936కు ముందు జరిగిన సన్నాహక సమావేశాలకు వచ్చిన వారిలో విజయలక్ష్మీ పండిత్‌ కూడా ఉన్నారు. విషయం ఒక రూపం దాలుస్తూ వుండగా, ప్రేమ్‌చంద్‌, జోష్‌ మలిహాబాదీ, మౌలానా ఆబ్దుల్‌ హక్‌, శివ్‌ దాస్‌ సింగ్‌ చౌహాన్‌, నరేంద్ర శర్మ, హర్ష్‌ దేవ్‌ మాలవియా, రచయితలలోకం నుంచి ఈ సంఘంలో ప్రవేశించారు. అటు రాజకీయ సాంఘిక రంగాలకు చెందిన నెహ్రూ, జయప్రకాశ్‌ నారాయణ్‌, ఆచార్య నరేంద్ర దేవ్‌, రామ్‌వృక్ష బెనిపురి, దీనికి ఆమోదం తెలిపారు.
బెంగాల్‌లో గల హీరేన్‌ ముఖర్జి, సజ్జద్‌ జహీర్‌ మిత్రుడు, ఈ ప్రణాళికను గురుదేవ్‌ రవీంద్రనాథ ఠాగోర్‌కు చెప్పగా వారి ఆమోదం లభించింది. విషయం సరోజినీ నాయుడుకు కూడా తెలిసింది. మౌలానా హస్రత్‌ మోహాని, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌, కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ నాయకులైన కమలా దేవి చటోపాధ్యాయ, అశోక్‌ మెహతా, అచ్యుత్‌ పట్వర్ధన్‌ వంటి వారి మద్దతు ఈ సంఘం పొందింది. ప్రేమ్‌చంద్‌ హిందీ, ఉర్దూ భాషా సాహిత్య సృజనలో అందె వేసిన చేయి. ఈ మొదటి సభలకు అధ్యక్షత వహించడానికి ఆమోదం తెలిపాడు. ఏప్రిల్‌, 1936లో లక్నో లోని 'రఫీ- ఆం హాల్‌'లో అలా భారతీయ ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ సంఘపు మొదటి సభలు జరిగాయి.
కాంగ్రెస్‌లో వామపక్ష భావజాలానికి ప్రసిద్ధుడైన జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ సభలకు వచ్చి ప్రసంగించారు. తనతో బాటుగా సరోజినీ నాయుడు, జయప్రకాష్‌ నారాయణ్‌, యూసుఫ్‌ మహ్రాల్లి, ఇందులాల్‌ యాజ్ఞిక్‌, కమలాదేవి చటోపాధ్యాయ తదితరులు ప్రేమ్‌చంద్‌ అధ్యక్షతన జరిగిన ఈ తొలి సభల్లో పాల్గొన్నారు. ఈ తొలి సభలలో సామ్రాజ్యవాద, వలసవాద ఆధిపత్య వ్యతిరేకత ప్రస్ఫుటంగా వ్యక్తమయింది. ఈ మహాసభల్లో అధ్యక్ష స్థానం నుంచి మాట్లాడుతూ, ప్రేమ్‌చంద్‌ 'ఇప్పుడు మనం సౌందర్యపు ప్రమాణాలను మార్చాల్సిన సమయం వచ్చింది. మన సాహిత్య అభిరుచి పెద్ద యెత్తున మార్పులకు గురవుతోంది. జీవిత వాస్తవాలను బహుళంగా పట్టించుకుంటూ, ఇప్పుడు మనం మనిషి, సమాజం సాహిత్యపు కేంద్ర అంశాలుగా భావిస్తున్నాము. విరహాల గురించి భగ గీతాలు పాడడమో, లేదా అద్భుత గాధలను రచించడంలోనో ప్రస్తుత సాహిత్యం సంతృప్తి చెందడం లేదు. జీవితపు సమస్యలను గురించి చెప్పే సాహిత్యంగా ఒక సాంఘిక విలువను కలిగివుండడం ఇవాల్టి సాహిత్య లక్షణం' అన్నారు.
తమ సామ్రాజ్యవాద వ్యతిరేకతను, ఈ మహాసభలు స్పష్టంగా వ్యక్తం చేశాయి. ముస్సోలినీ, ఇథియోపియాపై దాడికి దిగడాన్ని, చైనాపై జపాన్‌ వారి దాడిని, భారత దేశంలో ఆంగ్ల పాలకులు అమలు పరుస్తున్న ప్రజల హక్కుల అణచివేతను నిరసిస్తూ తీర్మానాలు చేయడం ద్వారా లోకానికి ప్రకటించాయి. రెండో ప్రపంచ యుద్ధపు నీలి నీడలు కమ్ముకుంటున్న సంగతి గుర్తించి, ఈ యుద్ధాన్ని ఆపే చైతన్యాన్ని రచయితలు తమ కృషిలో భాగం చేసుకోవాలి అన్న పిలుపును కూడా ఈ సభలు ఇచ్చాయి. ఈ సభల్లో లక్నో విశ్వ విద్యాలయానికి చెందిన మహమాద్‌ జఫ్ఫర్‌, సజ్జద్‌ జహీర్‌, అబ్దుల్‌ ఆలీ తయారు చేసిన కానిస్టిట్యూషన్‌ను ఆమోదించింది. ఈ భారతీయ ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ సంఘపు ప్రధాన కార్యదర్శిగా సజ్జద్‌ జహీర్‌ ఎన్నికయారు.
సత్వరమే ఈ సంఘపు శాఖలు కలకత్తా, పూణే, బొంబాయి, అహ్మెదాబాద్‌, పాట్నా, ఆలిగడ్‌ వంటి ముఖ్య నగరాల్లో ఏర్పడ్డాయి. ఒక ఏడాది కాలం లోపునే, కేరళలోని త్రిస్సూర్‌లో సి.అచ్యుత కురుప్‌, ఈఏంఎస్‌.నంబూద్రిపాద్‌, ఏం.ఎస్‌.దేవదాస్‌, కె.దామోదరన్‌ వంటి సాంఘిక రాజకీయ ప్రముఖుల సహకారం, మద్దతుతో, భారతీయ ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ సంఘపు కేరళ విభాగం కూడా ఏర్పడింది. 20 ఏప్రిల్‌, 1937న తొలి సభ జరుపుకున్నది.
1943కు కానీ, ఈ భారతీయ ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ సంఘపు ప్రకంపనలు తెలుగు ప్రాంతానికి రాలేదు. ఒక పక్క విజయనగరంలో చాగంటి సోమయాజులు, శెట్టి ఈశ్వరరావు, అటుపక్క తెనాలిలో రైతు సంఘాలు ఏర్పరుస్తున్న చదలవాడ పిచ్చయ్య వేరు వేరుగా ఇటువంటి ఆలోచనలు కలిగి వున్నా, పిచ్చయ్య గారు యువకుడిగా రైతు కూలీ సంఘాలు ఏర్పరిచిన దానికి, తన తండ్రి చేత దెబ్బలు తిని, ఆ తలకట్టుతోనే విజయనగరం చేరుకోవడం, చాగంటి సోమయాజులు, శెట్టి ఈశ్వర రావులను కలిసి, తన ఆలోచనలు పంచుకోవడమే కాక, అటు మద్రాసు, ఇటు బరంపురం దాకా విస్తరించి వున్న తెలుగు ప్రాంతంలో, ఈ సభలు, అందరికీ అనువుగా, మధ్యగా వుండే చోట జరగడం సులువుగా వుంటుందని, విజయనగరంలో ఈ సభలు జరగాలని ఆలోచిస్తున్న వారిద్దరికీ నచ్చ చెప్పారు. ఆ ఆలోచనల ఫలితమే, తెనాలిలో జరిగిన ఆంధ్ర అభ్యుదయ రచయితల మహాసభలు. ఇవి ఏప్రిల్‌, 1943లో తాపీ ధర్మారావు గారి అధ్యక్షతన జరిగాయి. ఆసరికి భారతీయ ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ సంఘపు నాలుగో మహాసభలు మరో నెలలో బొంబాయిలో జరుపుకొనున్న తరుణం అది.
అలా శ్రీశ్రీ ఒక కవితగా 1936-37లో అందుకున్న భారతీయ ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ సంఘపు మానిఫెస్టో, తెలుగు నేలపై ఒక ప్రగతిశీల సాహిత్య సంఘంగా ఏర్పడ్డానికి ఆరేళ్ళ కాలం పట్టింది. అది యూరోప్‌, లండన్‌ లో ఒక మానిఫెస్టోగా మొదలై, మన దేశవ్యాప్తమై, తెలుగునాట కాలూనిన సామాజిక నిబద్ధత గల ఒక సాహిత్య యుగారంభ చరిత్ర. ఈ సాహిత్య కారుల ముందుచూపు, లక్ష్యాల సాధన, సాహిత్యం యొక్క సామాజిక నిబద్ధత ఇప్పుడు మరింత అందుకోవల్సిన చారిత్రిక సందర్భంలో ఉన్నాం మనం. రచయితలూ, సాహిత్య సంస్థలూ ఈ విషయాన్ని తీవ్రంగా చర్చించి, అవసరమైన ఆచరణాత్మక దృక్పథంతో నడవాలి.
 

- సాహితీమిత్ర