- విజయనగరం టెక్స్‌టైల్స్ మార్కెట్‌పై కార్పొరేట్ దెబ్బ
- పోటీని తట్టుకోలేక విలవిలలాడుతున్న వ్యాపారులు
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : పది మందికి వచ్చే లాభాన్ని ఒక్కరే మింగేస్తే ఎలా ఉంటుందో.. అచ్చంగా అలాగే ఉంది వస్త్ర వ్యాపార రంగంలో వచ్చిన మార్పు. 400 మందికి రావాల్సిన లాభాలు, కేవలం నలుగురైదుగురు మాత్రమే తన్నుకుపోతున్నారు. వస్త్ర వ్యాపార రంగానికి పెట్టింది పేరుగా ఉన్న విజయనగరంలో అచ్చంగా అదే సాగుతోంది. దీంతో స్థానిక వ్యాపారులు విలవిల్లాడుతున్నారు. ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. దుకాణాల్లో పనిచేసే సేల్స్‌మెన్లు, ఇతర సిబ్బందికీ డిమాండ్ తగ్గింది. వ్యాపారులు కక్కలేక మింగలేక అన్నట్టుగా లోలోపల మదన పడుతున్నారు.
ఉత్తరాంధ్ర, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో కొత్త దుస్తులు అనగానే టక్కున గుర్తొచ్చేది విజయనగరమే. ఇక్కడ దొరకని వెరైటీలు, డిజైన్లు మరెక్కడా దొరకవంటే అతిశయోక్తి కాదు. నగరంలోని బాలాజీ టెక్స్‌టైల్స్ మార్కెట్‌లో సుమారు 300 వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఇవి కాకుండా మెయిన్‌రోడ్డు, ఉల్లివీధి తదితర ప్రాంతాల్లో చిన్నా, పెద్దా కలుపుకుని మరో 400 దుకాణాలు ఉన్నాయి. సూరత్, కోల్‌కత్తా, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి స్థానిక వ్యాపారులు రూ.కోట్ల విలువ చేసే సరుకులను నిరంతరం దిగుమతి చేస్తుంటారు. ముఖ్యంగా బాలాజీ మార్కెట్ నుంచి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఒడిశాలోని రాయగడ, పర్లాకిమిడి, బరంపురం, సుంకి, సునాబెడా మీదుగా జైపూర్ వరకు ఉన్న చిన్న వ్యాపారులు వస్త్రాలను కొనుగోలు చేస్తుంటారు. వారు దుకాణాల్లోనూ, గ్రామాల్లోనూ తిరుగుతూ వస్త్రాలను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. సంక్రాంతి, క్రిస్మస్, ఉగాది, దీపావళి తదితర పండగలకు నెల రోజుల ముందు నుంచే వ్యాపారులు, వినియోగదారులతో మార్కెట్ రద్దీగా ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్, ఇతర శుభకార్యాల సమయంలో మరింత కళకళలాడుతుంది. జిల్లాలో వస్త్ర వ్యాపారం రోజూ రూ.కోట్లలోనే సాగుతుంది. గడిచిన దశాబ్ద కాలంగా బహుళజాతి సంస్థలు విజయనగరంలో కుప్పలు తెప్పలుగా ఏర్పడడంతో పూర్వం నుంచీ ఉన్న వస్త్ర దుకాణాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
చిరువ్యాపారులు కుదేలు
ఇటీవల విజయనగరంలో సౌత్‌ఇండియా షాపింగ్‌మాల్ ఏర్పడింది. అంతకు ముందే రిలయన్స్, సిఎంఆర్, కళావైభవ్, ట్రెండ్స్, ఈజీబై, మ్యాక్స్, తదితర మల్టీ నేషనల్ కంపెనీలు వచ్చాయి. త్వరలో డి-మార్ట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. కొన్ని షాపింగ్ మాల్స్‌లో దుస్తులతోపాటు ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ గూడ్స్, బంగారం వంటి అనేక రకాల వస్తు సామగ్రి అందుబాటులో ఉంచడంతో జనం సహజంగానే వాటి వైపు మొగ్గుచూపుతున్నారు. దీనికితోడు అన్ని రకాల వస్త్రాలు, వస్తు సామగ్రిపై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో, అనివార్యంగా పూర్వం నుంచీ ఉన్న దుకాణాల్లోని వ్యాపారం తగ్గుతోంది. కొనుగోలుదారుల సంగతి పక్కనబెడితే, బహుళజాతి సంస్థలతో పోటీని తట్టుకోలేక చిన్న, మధ్య తగరతి వ్యాపారులు కుదేలవుతున్నారు. వాటిలో పనిచేసే కార్మికులకు పనితగ్గుతుండడంతో అనివార్యంగా మెన్‌పవర్ తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో కార్మికులకు కూడా డిమాండ్, వేతనాలు తగ్గుముఖం పట్టాయి. గతంలో చదువుకోవడానికి వచ్చిన యువతీ, యువకులు పండగల సీజన్లలో దుకాణాల్లో పార్ట్ టైం జాబ్ చేసి తల్లిదండ్రులపై భారాలు పడకుండా చూసుకునేవారు. ప్రస్తుతం షాపింగ్‌మాల్స్ వచ్చాక అటువంటి అవకాశాలు తగ్గిపోయాయి.










