Jul 31,2023 20:53

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఆగస్టు 16 నుండి 19వ తేదీ వరకు ఈ- వేలం వేయనున్నట్లు సోమవారం టిటిడి అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వేలంలో కొత్తవి, ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 194 లాట్లు ఉన్నాయి. ఇందులో పాలిస్టర్‌, కాటన్‌ పంచలు, క్లాత్‌ బిట్స్‌, హుండీ గల్లేబులు, పవిత్రాలు, బ్లౌజ్‌పీస్‌లు, ఉత్తరీయాలు, టర్కీ టవళ్లు, లుంగీలు, శాలువలు, బెడ్‌షీట్లు, దిండుకవర్లు, పంజాబి డ్రెస్‌ మెటీరియల్స్‌, జంకాళం కార్పెట్లు, దుప్పట్లు, కర్టన్లు, గర్భగృహ కురాళాలు, బంగారువాకిలి పరదాలు, కాకి పరదాలు ఉన్నాయని తెలిపారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గాని, టిటిడి వెబ్‌సైట్‌ సంప్రదించాలని సూచించారు.