ఇవి కార్ల దిగుమతిపై సుంకం 15 శాతమే
న్యూఢిల్లీ : టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం తలగ్గినట్లు స్పష్టమవుతోంది. విదేశాల నుంచి దిగుమతయ్యే విద్యుత్ కార్లపై సుంకాన్ని భారీగా తగ్గిస్తూ కొత్త ఇవి పాలసీని తీసుకురానుందని రిపోర్ట్‌లు వస్తోన్నాయి. అదే జరిగితే టెస్లాతో పాటు పలు విదేశీ కార్ల కంపెనీలకు భారీగా లబ్ధి చేకూరనుంది. కొత్త పాలసీలో దేశీయంగా కార్ల తయారీ చేపడితే 100 శాతం నుంచి 15 శాతానికి దిగుమతి సుంకం తగ్గించే ప్రతిపాదన చేస్తున్నట్లు సమాచారం. కాగా.. ప్రస్తుతం దిగుమతి అవుతోన్న కార్లపై 70ా100 శాతం పన్ను అమల్లో ఉంది. ఈ పన్ను శాతానికి భారీగా తగ్గించాలని అమెరికన్ పెట్టుబడిదారుడు ఎలన్ మస్క్ చాలా కాలం నుంచి భారత్‌ను డిమాండ్ చేస్తూ వస్తోన్నారు. అందుకు అనుగుణంగా కొత్త పాలసీని రూపొందిస్తోందని తెలుస్తోంది. కార్లకు సంబంధించి దేశీయంగా కొన్ని విడి భాగాలు తయారు చేసినా దిగుమతి సుంకాన్ని 15 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. దీనిపై ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ప్రతిపాదిత కొత్త పాలసీ అమల్లోకి వస్తే టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి దేశీయ సంస్థలపై ఒత్తిడి నెలకొననుంది.










