Oct 28,2023 12:48

గుంటూరు : గుంటూరులో ఉద్రిక్తత ఏర్పడింది. 'నిజం గెలవాలి' పేరుతో నారా భువనేశ్వరి నిర్వహిస్తున్న యాత్రకు సంఘీభావంగా.. 'భువనమ్మకు అండగా.. చంద్రన్నకు తోడుగా' నినాదంతో శనివారం గుంటూరు లాడ్జి సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద టిడిపి శ్రేణులు నిరసన చేపట్టారు. పోలీసులు ఈ ఆందోళనకు అనుమతివ్వలేదరు. లాడ్జి సెంటర్‌కు వచ్చిన టిడిపి నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి మాణిక్యరావుతోపాటు కొందరు కార్యకర్తలు అంబేడ్కర్‌ విగ్రహం స్టాండ్‌పైకి ఎక్కి ఆందోళన చేశారు. పోలీసులు అరెస్టు చేయటానికి వస్తే పైనుంచి దూకుతామని బెదిరించారు. దీంతో పోలీసులు వెనక్కు తగ్గారు. ఈలోగా కార్యకర్తలు భారీగా వచ్చి అంబేద్కర్‌ కూడలి వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్టు అక్రమమనే విషయం ప్రజలంతా గుర్తించారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసిపికి బుద్ధి చెప్పటం ఖాయమని టిడిపి కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్‌, పార్టీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌ అన్నారు. పోలీసుల నిర్బంధంపై కార్పొరేటర్లు బాబు, సమత ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు మాట్లాడుతూ ... పోలీసుల వైఖరిని ఖండించారు. అధికార పార్టీ నేతల పుట్టినరోజు ర్యాలీలకు అనుమతించే పోలీసులు.. టిడిపి నిర్వహిస్తున్న శాంతియుత నిరసనలకు అనుమతించకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని, భువనేశ్వరి యాత్రపై ఎగతాళిగా మాట్లాడేవారికి త్వరలో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.