
- కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు
ప్రజాశక్తి-పెనుమంట్ర(పశ్చిమగోదావరి) : భూ యజమానితో వాలంటీర్లు, వీఆర్వోలు మాట్లాడి కౌలురైతులకు కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని.. భూయజమానులు ఒప్పుకోకపోతే ప్రభుత్వమే కౌలు రైతులను గుర్తించాలని రాష్ట్ర కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు డిమాండ్ చేశారు. కౌలు రైతుల సంఘం జిల్లా విస్తత సమావేశం మార్టేరు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో మంగళవారం జిల్లా అధ్యక్షులు కె.సుబ్బరాజు అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా హరిబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలురైతుల చట్టానికి భూయజమాని సంతకంతో సంబంధం లేకుండా సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా కౌలురైతుల పేరునే పంట నమోదు చేసి రైతుభరోసా, పంట రుణాలు, పంటనష్టం, పంటలభీమా కౌలు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణం సాగునీరు పూర్తి స్థాయిలో విడుదలచేయాలని, కాలువలను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి ఎం.రామాంజనేయులు, నాయకులు కె.గోపాలన్, పి.నర్శింహమూర్తి, కె.శ్రీనివాస్, బి.శ్రీనివాసరావు, కె.పూర్ణారావు, ఎ.సన్యాసిరావు, కె.సత్యనారాయణ, కె.జగన్నిధం, ఫిలీఫ్,ఎ గంగాచలం తదితరులు పాల్గొన్నారు.