May 08,2023 08:33
  •  సాగు ఇబ్బందులు, పంట నష్టాలతో అన్నదాత విలవిల
  •  వరి, మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరం
  •  ధాన్యం అమ్ముకునేందుకు సైతం రైతులకు పాట్లే
  •  కౌలు రైతులకు దక్కని ప్రభుత్వ సాయం
  •  బ్యాంకురుణాలు, పంటనష్టం సైతం భూయజమానుల ఖాతాల్లోకే
  •  దిక్కుతోచని స్థితిలో ఉమ్మడి జిల్లాలో 3 లక్షల మంది కౌలురైతులు

ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి : సాగు ఇబ్బందులు, వరుస పంట నష్టాలతో కౌలురైతులు విలవిల్లాడిపోతున్నారు. ప్రభుత్వం నుంచి భరోసా దక్కకపోవడంతో వాస్తవ సాగుదారుడైన కౌలురైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అప్పుల బాధతో నిత్యం నరకం అనుభవిస్తున్న పరిస్థితి నెలకొంది. బ్యాంకులు అందించే పంట రుణాలు, ప్రభుత్వం అందించే పంట సాయం, బీమా వంటివి సైతం సాగు చేసే కౌలురైతులకు అందడం లేదు. సాగుకు దూరంగా ఉంటున్న భూయజమాని ఖాతాల్లోకే ప్రభుత్వ సాయం 90 శాతం చేరిపోతుంది. జిల్లాలో ప్రధానమైన పంట సాగుచేసే వరి రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా మారగా, మామిడిరైతులు సైతం తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మూడు లక్షల మంది వరకూ కౌలురైతులు ఉన్నారు. జిల్లాలో దాదాపు 16 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుండగా జిల్లా సాగులో 75 శాతం కౌలురైతులే చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లా వ్యవసాయ రుణ ప్రణాళికలో పంట రుణాలకు రూ.వేల కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రణాళికలు రూపొందిస్తున్న కౌలురైతులకు ఒక్క శాతం రుణం కూడా అందని దుస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏలూరు జిల్లాలో కౌలురైతులకు బ్యాంకుల నుంచి అందిన పంట రుణాలు దాదాపు రూ.50 కోట్లు మాత్రమే. పశ్చిమలోనూ కౌలురైతులకు పెద్దగా రుణాలివ్వని పరిస్థితి ఉంది. ప్రయివేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పు తెచ్చి కౌలురైతులు వ్యవసాయం చేస్తున్నారు. పంట దెబ్బతిన్నా తెచ్చిన అప్పులు వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి చిల్గిగవ్వ సాయం అందడం లేదు. ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే రైతుభరోసా సొమ్ము సైతం వాస్తవ సాగుదారుడైన కౌలురైతులకు అందడం లేదు.

  • ప్రభుత్వానికి పట్టని కౌలురైతుల గోడు

కౌలురైతుల గోడు ఏ ప్రభుత్వానికీ పట్టడం లేదు. ఎన్నికల ముందు కౌలురైతులను ఆదుకుంటామని హామీలు గుప్పించడం మినహా ఆచరణలో మాత్రం ఏమీ లేకుండా పోతుంది. 2019లో వైసిపి ప్రభుత్వం కౌలురైతుల కోసం తెచ్చిన చట్టం రైతులకు ఉరితాడుగా మారింది. భూయజమాని అంగీకారంతో కౌలుకార్డు ఇవ్వాలని నిబంధన పెట్టడంతో కౌలురైతులకు కౌలుకార్డు కూడా అందని పరిస్థితి నెలకొంది. దీంతో ధాన్యం అమ్ముకునేందుకు సైతం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక ప్రతియేటా ఖరీఫ్‌లో పెద్దఎత్తున పంటలు దెబ్బతింటున్నా కౌలురైతులకు మాత్రం సాయం అందడం లేదు. బీమా సైతం భూయజమాని ఖాతాల్లోకే వెళ్లిపోతుంది. గడిచిన రెండేళ్లుగా వరి సాగులో రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. సంచుల్లేక, లారీలు సకాలంలో రాక ధాన్యం అమ్ముకునేందుకు రైతులకు నరకం చూస్తున్నారు. ప్రస్తుత రబీలో ఒకపక్క వర్షాలు, మరోపక్క ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలివానలకు మామిడి కాయలు రాలిపోయి రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.
మామిడి సాగులోనూ అత్యధికంగా కౌలురైతులే ఉన్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో వ్యవసాయం చేయాలంటేనే భయపడే పరిస్థితికి రైతులు చేరుకున్నారు. సాగు చేసే కౌలురైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ అందకపోవడం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కౌలురైతులకు న్యాయం చేసేవిధంగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పరిస్థితులు దారుణంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.